మల్లాపూర్, సెప్టెంబర్ 7: వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి జోన్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశించారు. మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వినాయక నిమజ్జన బందోబస్తుపై పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు ఇచ్చారు. 9, 10వ తేదీల్లో నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద, ప్రధాన రహదారుల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ రెండు రోజులు మద్యం షాపులు మూసివేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. చెరువుల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు బాంబు స్కాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగి డీసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ షీ టీమ్స్ సలీమా, డీసీపీ వెంకటేశ్వర్లు, కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మీ పెరుమాల్, అడిషనల్ డీసీపీ షమీర్, లక్ష్మి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.