నగరంలో ఈ నెల 9న జరిగే గణనాథుల శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రక్రియ సాఫీగా సాగేలా వివిధ శాఖలు పకడ్బందీ ప్రణాళికతో సిద్ధమయ్యాయి. విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ సహా 31 చెరువులతో పాటు 74 ఇతర కొలనులను ఏర్పాటు చేశారు. మొత్తం 280 సాధారణ క్రేన్లు, మరో 130 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచారు. ప్రధాన రహదారులతో పాటు విగ్రహాలు ప్రయాణించే సుమారు 303.5 కిలోమీటర్ల మార్గంలో ఎలాంటి గుంతలు లేకుండా చూస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం జలమండలి 122 క్యాంపులను ఏర్పాటు చేస్తుంటే.. సమర్థవంతమైన పారిశుధ్య నిర్వహణకు బల్దియా 10470 మంది సిబ్బందితో 253 ప్రత్యేక బృందాలను నియమించింది. మరోవైపు చవితి తర్వాతి రోజు నుంచి సాగుతున్న మట్టి విగ్రహాల నిమజ్జనంతో సాగర్ పరిసరాలు సందడిగా మారాయి.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 9వ తేదీన జరిగే గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ, ఆర్అండ్ బీ, జలమండలి, గ్రేటర్ డిస్కం, పర్యాటక శాఖలతో జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు సమన్వయం చేస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, ట్యాంక్‌బండ్ సహా 31చెరువులతో పాటు పీవోపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా 74 కొలనులను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులతో పాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 303.5 కి.మీల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 3-4 కిలోమీటర్ల వరకు మొత్తం 25 మంది శానిటేషన్ సిబ్బంది కొలనుల వద్ద ఒక క్రేన్, 7-14 మంది వరకు సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. నిమజ్జనానికి మొత్తంగా 280 క్రేన్లు, 130 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
జీహెచ్ఎంసీ: గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర నిర్వహించే 303.30 కిలోమీటర్ల రహదారులలో పారిశుధ్య నిర్వహణకు10,470 మంది సిబ్బందితో శానిటరీ సూపర్వైజర్ లేదా ఎస్ఎఫ్ఏల ఆధ్వర్యంలో 253 ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రతి 3-4 కిలోమీటర్ల మేరలో గణేశ్ యాక్షన్ టీమ్‌లు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 98 క్రేన్లను అందుబాటులో ఉంచారు.
ఆర్ అండ్ బీ శాఖ: హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్ లేయర్ భారీగేట్లను ఏర్పాటు చేయనున్నారు. నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం, వాచ్టవర్లను ఏర్పాటు చేశారు.
హెచ్ఎండీఏ: జీహెచ్ఎంసీ సమన్వయంతో నిమజ్జనమైన వినాయక విగ్రహాల తాలూకూ వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టనుంది. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, ఇతర వ్యర్థాలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ యంత్రాంగం వెంటనే తొలగించనుంది. ఇందుకు 1000 మంది లేబర్స్, సూపర్వైజర్ స్టాఫ్‌ను నియమించారు.
జలమండలి: శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం జలమండలి 122 క్యాంపులను ఏర్పాటు చేయనుంది.
అగ్నిమాపక శాఖ: శోభాయాత్ర జరుగుతున్న ప్రాంతాలలో 38 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచనుంది.
పర్యాటక శాఖ : ట్యాంక్‌బండ్ వైపున మూడు బోట్లు, నెక్లెస్‌రోడ్ వైపు రెండు బోట్లతో పాటు హుస్సేన్‌సాగర్‌లో నాలుగు స్పీడ్ బోట్లను అందుబాటులోకి ఉంచనున్నారు. సరూర్‌నగర్, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల వద్ద నాలుగు ప్రత్యేక బోట్లను సమకూర్చనుంది.
టీఎస్ఎస్పీడీసీఎల్: హుస్సేన్‌సాగర్ లేక్, పరిసర ప్రాంతాల్లో 48 ట్రాన్స్ఫార్మర్లు, సరూర్‌నగర్ లేక్ వద్ద ఐదు ట్రాన్స్ఫార్మర్లు, ఇతర ప్రాంతాలు కలిపి మొత్తంగా 101 ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచనున్నారు. 48,179 తాత్కాలికంగా స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు.
అర్బన్ బయో డైవర్సిటీ విభాగం: శోభాయాత్ర జరిగే రూట్లలో విగ్రహాల తరలింపులో ఆటంకం లేకుండా చెట్ల కొమ్మలను తొలగించనున్నారు. సర్కిల్‌కు ఇద్దరు చొప్పున నిరంతరం ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఆర్టీఏ: గణనాథుల తరలింపులో భాగంగా రవాణాశాఖ అధికారులు 1500 వాహనాలను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సమకూర్చుతున్నారు. 14 ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని, ఈ నెల 8వ తేదీన భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు వాహనాలను అందజేస్తామని గ్రేటర్ హైదరాబాద్ జేటీసీ పాండురంగ నాయక్ తెలిపారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి మండపం వద్ద పోలీస్ సిబ్బందిని నియమించడంతో పాటు ఎప్పటికప్పుడు బల్దియా పారిశుధ్య సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పనిచేస్తున్నారు. నిమజ్జనానికి 74 బేబీ పాండ్లను ఏర్పాటు చేశాం. వాటిలో మురుగునీరు ఉన్నదని చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే మేం చేస్తాం.. అని కొందరంటున్నారు. ఎలా చేస్తారు.. ఇంత మంది పోలీసులు, సిబ్బందిని ఎక్కడి నుంచి తెస్తారో వారే చెప్పాలి. కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు.