ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 : వినాయకచవితి తర్వాతి రోజు నుంచి నిమజ్జనపర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్విఘ్నంగా గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నవరాత్రి ముగింపు తర్వాత జరిగే నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతనివ్వడంతో సామాన్యులు సైతం అధిక సంఖ్యలో వాటినే పూజించారు. వేలాదిగా మట్టి గణపతులు నిమజ్జనానికి వస్తుండగా, జీహెచ్ఎంసీ చొరువతో నిరాటంకంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు క్రేన్లు, టిప్పర్లు, జేసీబీలు 24/7 పనిచేస్తుండగా, కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.
ఎన్టీఆర్ మార్గ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు
గణేశ్ నిమజ్జనాలంటే ప్రధానంగా ట్యాంక్ బండ్‌తో పాటు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్‌ప్లాజా వేదికలుగా నిలుస్తాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మూడేసి క్రేన్లు అందుబాటులో ఉంచగా, తొమ్మిదో రోజు భారీగా నిమజ్జనాలు జరిగే అవకాశం ఉండటంతో ఎన్టీఆర్ మార్గ్‌లో తొమ్మిది, పీపుల్స్‌ప్లాజా పరిసరాల్లో 8 క్రేన్లను వినియోగిస్తున్నారు. ఒక్కో ఘాట్ వద్ద మూడు నుంచి నాలుగు చొప్పున జేసీబీలు ఉపయోగిస్తున్నారు. అవశేషాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు పది టన్నుల సామర్థ్యం గల పది టిప్పర్లను వాడుతున్నారు. ఒక్కో క్రేన్ వద్ద ఆరుగురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
బేబీ పాండ్స్‌లో చిన్న ప్రతిమలు నిమజ్జనం
ఖైరతాబాద్ జోన్లో 12 బేబీ పాండ్స్‌ను ఏర్పాటుచేయగా 5 పీట్ల నుంచి తక్కువ పరిమాణంలో ఉన్న విగ్రహాలను అందులోనే నిమజ్జనం చేస్తున్నారు. బేబీపాండ్స్లో ఎప్పటికప్పుడు నీటిని నింపుతున్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిమజ్జన అవశేషాలను తొలగిస్తుండగా, ట్రాన్స్పోర్ట్ విభాగం టిప్పర్ల ద్వారా అవశేషాలను తరలిస్తున్నారు.
నిరంతరాయంగా వ్యర్థాల తొలగింపు
పండుగ తర్వాతి రోజు నుంచి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాం. గణపతిని నిమజ్జనం చేసేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు క్రేన్లు, తగినంతమేర కార్మికులను నియమించాం. 24/7 ఎన్టీఆర్మార్గ్, పీపుల్స్‌ప్లాజా, బేబీ పాండ్స్ వద్ద నిమజ్జనాలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు నిమజ్జన అవశేషాలను తొలగిస్తున్నాం. ఈ నెల 9 నుంచి నిమజ్జనాలు ముగిసేంత వరకు పనులను పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా నిమజ్జనం కొనసాగుతున్నది.
– డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్, ఖైరతాబాద్ సర్కిల్