కందుకూరు, సెప్టెంబర్ 4: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! అది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి స్వగ్రామానికి వెళ్లే రహదారి. ఈ రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారై, గుంతలమయంగా మారింది. రోడ్డుకు నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సిన కేంద్రమంత్రి అసలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాచూలూరు గ్రామ నుంచి తిమ్మాపూరు గ్రామానికి వెళ్లే మూడు కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడి, చిందర వందరగా మారింది. దీంతో రహదారిపై వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు. మూడు కిలో మీటర్లు వెళ్లడానికి గంటల తరబడి సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు. వాహనదారులు వెళ్లడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిని చూసి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకవెళ్లగా నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం సక్రంగా లేక పోవడంతో సర్పంచ్ గోపాల్ రెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు స్థానిక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకవెళ్లగా, ఆమె తక్షణమే ఈ రోడ్డును ఆర్ ఆండ్ బీకి మార్చాల్సిందిగా అధికారులను ఆదేశించి ప్యాచ్ పనుల నిమిత్తం రూ.10 లక్షలను మంజూరు చేసింది. రాచులూరు నుంచి తిమ్మాపూరు వరకు, తిమ్మాపూరు నుంచి లేమూరు వరకు రోడ్డును అభివృద్ధి చేయాల్సిందిగా ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. పుట్టిన ఊరును పట్టించుకోని కేంద్రమంత్రి ఇక ఇతర గ్రామాల గురించి ఎలా పట్టించుకుంటారని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు సక్రమంగా లేదని, రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన, నిధుల మంజూరుపై ఉలుకూ పలుకూ లేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికీ చెప్పిన మంత్రి వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేసిన్రు. అంతే కాకుండా ఈ రోడ్డును ఆర్ అండ్ బీ రోడ్డుకు మార్చాలని కూడా సూచించిన్రు.
– గంగాపురం గోపాల్‌రెడ్డి, సర్పంచ్ – తిమ్మాపూరు
రాచులూరు నుంచి తిమ్మాపూరు వరకు గల రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. మంత్రి సబితారెడ్డి చొరవతో నిధులు మంజూరైనయి. త్వరలోనే పనులు ప్రారంభం అయితయి. ప్రగల్బాలు పలికే కేంద్ర మంత్రి కేంద్రం నుంచి కనీసం ఊరు బాగోగుల కోసం ఎందుకు నిధులు తేవడం లేదు.
– వట్నాల ఈశ్వర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ తిమ్మాపూరు