కంటోన్మెంట్ చరిత్రలోనే పక్కా కమర్షియల్‌గా కొనసాగుతున్న యశోద టాకీస్ స్థలం కాస్తా రెసిడెన్షియల్ కేటగిరిలోకి మారిపోయింది. శ్రీకిషన్ అగర్వాల్, జగదీష్ అగర్వాల్ అనే వ్యక్తుల పేరిట బోర్డుకు వచ్చిన దరఖాస్తును బోర్డు పరిశీలనకు తీసుకుంది. అన్ గిఫ్టెడ్ లే అవుట్ కేటగిరీలో చేరుస్తూ బోర్డు అనుమతి కోసం గత ఏప్రిల్ 7న జరిగిన బోర్డు ఎజెండాలో చేర్చారు.
అధికారుల చొరవతో బోర్డు ఎజెండాలోకి చేరిన యశోద టాకీస్ అనుమతిపై రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమర్షియల్ నిర్మాణంగా కొనసాగుతున్న స్థలంలో రెసిడెన్షియల్ అనుమతికి ఎందుకు దరఖాస్తు చేశారు. ప్రతిపాదిత స్థలంలో ఇప్పటికీ కమర్షియల్ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వాటిని తొలగించాకే దరఖాస్తును పరిశీలించాలని సమావేశంలో పట్టుబట్టడం జరిగింది. దీనికి సీఈఓ సమాధానమిస్తూ రెసిడెన్షియల్, కమర్షియల్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం దరఖాస్తుదారుడి ఇష్టమని స్పష్టం చేశారు. అయితే బోర్డు సభ్యుడి అభ్యంతరం మేరకు తర్వాతి బోర్డు సమావేశం వరకు అనుమతిని పెండింగ్‌లో పెడుతున్నామని పేర్కొన్నారు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది …..అన్న చందంగా తయారైంది…కంటోన్మెంట్ వెరీడ్ బోర్డు తీరు. పూర్తిస్థాయి పాలకమండలి గడువు ముగియడంతో వెరీడ్ బోర్డుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు అధికారులు, ఓ నామినేటెడ్ సభ్యుడు మాత్రమే ఉంటారు. ఇదే అదునుగా వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌గా, ఎన్నో ఏండ్ల్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను క్లియర్ చేస్తూ…నాలుగు రాళ్లు వెనకేసుకునే పనిలో వెరీడ్ బోర్డు నిమగ్నమైనట్లు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే…..కంటోన్మెంట్ సిఖ్విలేజ్లోని సర్వే నెంబర్ 10లో చందూలాల్ బౌళి అనే ప్రాంతంలోని గతంలో యశోద టాకీస్ ఉండేది. కంటోన్మెంట్లో లే-అవుట్ బైలాస్ పురుడుపోసుకోక ముందే ఇక్కడ బోర్డు అనుమతితో సినిమా
థియేటర్ వెలిసింది.తొలినాళ్లలో బాగానే నడిచినా ఇటీవల ఆ థియేటర్ పూర్తిగా మూతపడింది. దీంతో తాజాగా యశోద టాకీస్‌కు చెందిన స్థలంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు బోర్డుకు వచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
నాలుగు నెలల తరువాత జరిగిన బోర్డు సమావేశంలో ఎలాంటి అభ్యంతరాలు, చర్చ లేకుండానే ‘యశోద టాకీస్’ స్థలంలో నిర్మాణాలకు బేషరతుగా అనుమతులు ఇచ్చింది. గతంలో రామకృష్ణ లేవనెత్తిన అభ్యంతరాలు, వాటికి అధికారులు ఇచ్చిన వివరణ ఏదీ బోర్డు ముందు పెట్టకపోవడం గమనార్హం. దీంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.