కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 4 : కూకట్పల్లి నియోజకవర్గంలో కొత్త ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న పేద ప్రజల కలలు త్వరలోనే నెరవేరనున్నది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 సం॥లు నిండిన వారితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందనున్నాయి. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త ఆసరా పింఛన్లను మంజూరు చేయడానికి ఆదేశించిన నేపథ్యంలో జిల్లాల వారీగా.. నియోజకవర్గాల వారీగా ఆసరా పింఛన్లను అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు ఆసరా పింఛన్లతో పాటు గుర్తింపు కార్డులను నేరుగా అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కాగా మరో వారం రోజుల్లో అర్హులైన వారందరి చేతికి ఆసరా పింఛన్లు అందనున్నాయి.
కూకట్పల్లి నియోజకవర్గంలో ఆసరా పింఛన్ల పంపిణీకి జీహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం కార్యచరణను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో 10,173 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 21,251 మంది ఆసరా పింఛన్లు పొందుతుండగా.. కొత్త వారితో కలిపి నియోజకవర్గంలో 31,424 మందికి ఆసరా పింఛన్లు అందనున్నాయి. కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన వారిలో 57 నుంచి 64 సం॥ల మధ్య వయస్సు గల లబ్ధిదారులు 6,264 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు 998, వితంతువులు 2,095, దివ్యాంగులు 630, ఒంటరి మహిళలు 185, ఫైలేరియా ఒకరు ఉన్నారు. వీరందరికీ వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ఆసరా పింఛన్తో పాటు గుర్తింపు కార్డును అందించనున్నారు.
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో ఆసరా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈనెల 6న బోయిన్పల్లిలో ప్రత్యేక సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు, గుర్తింపు కార్డులను అందించనున్నారు. తర్వాత బాలానగర్, ఫతేనగర్, అల్లాపూర్, మూసాపేట, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, బేగంపేట వార్డులలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఆసరా పింఛన్లు మంజూరైన వారందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు వార్డుల వారీగా ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు సమాచారాన్ని అందిస్తున్నారు.
సమాజంలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సం॥లు నిండిన వృద్ధులందరికీ ఆసరా పింఛన్లను అందిస్తున్నారు. గత పాలకులు వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 పింఛన్లు ఇచ్చారు. నేడు వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. 57 సం॥లు నిండిన వృద్ధులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రేపటినుంచి పింఛన్ల డబ్బులు, గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది.
– మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్పల్లి