బడంగ్‌పేట, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ సహకారంతో రూ.11కోట్లతో వర్షం, డ్రైనేజీ నీరు వేర్వేరుగా వెళ్లే విధంగా శ్రీధర్ కాలనీలో నాలా పనులు పూర్తి చేయడం జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాలనీ వాసులు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. మంత్రిని కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలోనే నిజమైన తృప్తి ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీధర్ కాలనీలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ.4కోట్లతో, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ రూ.4కోట్లతో, తుక్కుగూడలో రూ.3కోట్లు, జల్పల్లి మున్సిపాలిటలో రూ.3 కోట్లతో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మా తండాలు.. మా పాలన అనే గిరిజనుల నినాదాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ తిరుమల్ నగర్లో నిర్వహించిన తీజ్ పండుగకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారా మహిళలు యువతలు నృత్యాలు చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని కుల సంఘాలకు కోకా పేటలో స్థలాలు కేటాయిస్తే బంజారులకు మాత్రం బంజారాహిల్స్‌లో ఆత్మగౌరవ భవనం నిర్మాణం చేయడం జరిగిందన్నారు.
ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా బంజారా భవనం ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్‌రెడ్డి, రామిడి కవితా రాంరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి స్వప్నావెంకట్‌రెడ్డి, బీమిడి స్వప్నాజంగారెడ్డి, బంజార సంఘం నాయకులు సంజీవనాయక్, రాజ్‌కుమార్ నాయక్, లాల్నాయక్, గోపాల్ నాయక్ ఉన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ జల్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ సమెద్ బిన్ సిద్ధిఖ్ తన ముఖ్య అనుచరులతో కలిసి ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ యువనాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్, కౌన్సిలర్లు షేక్ అఫ్జల్, సౌద్ అవల్గీ, కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు ఖైసర్బామ్, నాసర్ అవల్గీ, సత్తిరెడ్డి, నాగేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.