సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వారంతా నిరుపేదల కుటుంబాల పిల్లలు. కార్పొరేట్ వసతులు వారికి కానరావు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే జీవితం. ఇలాంటి వారి పిల్లల కోసం కోవే సంస్థ ప్రభుత్వ సహకారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉచితంగా డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు పనికిపోతే.. పిల్లలు ఆ సెంటర్లలో ఆడుతూ..పాడుతూ చదువుతూ హాయిగా గడుపుతున్నారు. ఆటబొమ్మలు, పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు అన్ని ఉచితంగా అందిస్తూ శ్రమజీవుల పిల్లల బాల్యం పుస్తకవనంలోకి చేరుస్తున్నారు.
ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయగా తాజాగా మౌలాలిలో ప్రారంభించారు. ఇప్పటికే జీడిమెట్ల, ఉప్పల్, చర్లపల్లి, కాళ్లకల్ ప్రాంతాల్లో డేకేర్ సెంటర్లు నిరుపేద పిల్లలకు బాసటగా నిలుస్తున్నాయి. కార్మికుల పిల్లల ఆలనాపాలనా తామే చూసుకుంటామని, తల్లిదండ్రులు పనికిపోతే ఇంటికొచ్చే వరకు డే కేర్ సెంటర్లలో భద్రంగా చూసుకుంటామని కోవే సంస్థ భరోసా ఇచ్చింది.
అనుక్షణం సీసీ కెమెరాల నిఘా
ప్రతి డేకేర్ సెంటర్ 500 నుంచి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20-30 మంది పిల్లలను చూసుకునేలా పూర్తిస్థాయిలో వసతులు కల్పించారు. ప్రతి కేంద్రంలో కోఆర్డినేటర్, సీనియర్ కేర్‌టేకర్, జూనియర్ కేర్‌టేకర్ ఉంటారు. ఒక విజిలెన్స్ బృందం, మానిటరింగ్ సీసీటీవీ ఫుటేజీ, క్వాలిఫైడ్ ట్రైనర్లు, సిస్టమ్స్ ఆడిటర్లు ఉంటారు. కోవే తన పైలట్ సెంటర్‌ను 2019లో ప్రారంభించింది. ఈ ఏడాది పారిశ్రామిక ప్రాంతాలైన జీడిమెట్ల, చర్లపల్లి, ఉప్పల్, కాళ్లకల్‌లో డేకేర్ సెంటర్లు నెలకొల్పింది.
సెంటర్లలో అన్ని వసతులు
పెద్దలు పనికి వెళ్లే ఇంట్లో చిన్నారులు ఒంటరిగా ఉండకుండా డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. వారి ఆలనాపాలన చూసుకునేందుకు అన్ని వసతులు కల్పించాం. పిల్లల బాల్యం అందంగా సాగేలా..చదువుకునేలా తీర్చిదిద్దుతాం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. డేకేర్ సెంటర్ల వివరాల కోసం 9396203333 నంబర్‌ను సంప్రదించాలి.
– నీరజ, కోవే సభ్యురాలు