సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎస్సార్డీపీ, లింకురోడ్లు, సీఆర్ఎంపీ వంటి పురోభివృద్ధి ప్రణాళికలతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్ని చోట్లా అందమైన పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే అనేక పార్కులను పునరుద్ధరించి, జంక్షన్లను విభిన్న ఆకృతులకు నిలయంగా మలిచిన యంత్రాంగం ఇప్పు డు శివారు ప్రాంతమైన ఉస్మాన్‌సాగర్ ప్రాంతాన్ని కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నది. శతవసంతాల గండిపేట వద్ద సరికొత్త ఆకర్షణగా ఐదున్నర ఎకరాల్లో 35.60 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో పార్కు నిర్మితమైంది.
1200 మంది కూర్చునేలా ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కు లోపలికి రప్పించే భారీ స్వాగత ద్వారం, 4 మీటర్ల వ్యాసార్ధంతో గ్లోబ్, వాక్ వే, పూల తోట, పిక్నిక్ జోన్, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక జోన్, ఫుడ్ కోర్టులు వంటి వసతులన్నింటినీ ఆకర్షించే థీమ్‌లతో నిర్మించారు. చల్లటి గాలులతో నిత్యం సందర్శకులను అలరిస్తున్న గండిపేట ఈ సరికొత్త సొబగుతో మరింత ఆహ్లాదాన్ని పంచనున్నది. కాగా ఈ పార్కును త్వరలోనే ప్రారంభిస్తామని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ ద్వారా తెలిపారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తేతెలంగాణ): చారిత్రక గండిపేట జలాశయం సందర్శనకు వచ్చేవారికి మధురానుభూతి కల్పించేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధునిక హంగులతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతోంది. కుటుంబ సమేతంగా రోజంతా హాయిగా గడిపేలా సకలవసతులు సమకూర్చుతోంది. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తరహాలో ఆహ్లాదాన్ని పంచేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరానికి మణిహారం లాంటి ఔటర్‌రింగు రోడ్డు అందాలు, మరోవైపు ఆకాశహార్మ్యాలతో భారీ బహుళ అంతస్తుల భవనాలు, ఆ చెంతనే జంటజలాశయాల్లో ఒకటైన గండిపేట (ఉస్మాన్‌సాగర్) ఇప్పుడు సందర్శకులకు సరికొత్త విడిది కానుంది. ఐటీ కారిడార్‌ను ఆనుకొని గండిపేట జలాశయానికి రాష్ట్ర ప్రభుత్వం నయా శోభను తీసుకొచ్చింది.
సుమారు 5.50 ఎకరాల విస్తీర్ణంలో రూ.35.60 కోట్ల వ్యయంతో అత్యాధునిక డిజైన్లతో పార్కును నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తికాగా, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యానవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని పురపాలక, ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. అత్యాధునిక శైలిలో పనులు చేపట్టిన హెచ్ఎండీఏను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మాదాపూర్ నుంచి కోకాపేట, గండిపేట వరకు విస్తరించిన ఐటీ కారిడార్‌లో నివాసముండే వారికి ఈ పార్కు ఎంతో ఆహ్లాదాన్ని పంచనుంది.
ఐటీ కారిడార్‌కు మరో ఆకర్షణ
ఒకప్పుడు నగరశివారులో ఉండే గండిపేట జలాశయం..ఐటీ రంగం దినదినాభివృద్ధితో మాదాపూర్ నుంచి కోకాపేట వరకు విస్తరించింది. కంపెనీల కార్యకలాపాలు, ఐటీ ఉద్యోగుల నివాస సముదాయాలు భారీగా వెలిశాయి. ప్రధానంగా కోకాపేట, గండిపేట, నార్సింగి ప్రాంతాల్లోనే ప్రస్తుతం భారీఎత్తున ఐటీ కంపెనీలు భవనాలు, నివాస భవనాలు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో కొత్తగా గండిపేట చెరువును ఆనుకొని చేపట్టిన పార్కు ఐటీ కారిడార్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహానగర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండీఏ పార్కు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూ.36 కోట్లతో చేపట్టింది.
విస్తరిస్తున్న పశ్చిమం
రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహానగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాలకు సమీపంలోనే గండిపేట జలాశయం ఉంది. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ తరహాలో గండిపేట జలాశయానికి సమీపంలో పదుల సంఖ్యలో నివాస సముదాయాలు (గేటెడ్ కమ్యూనిటీలు) వెలిశాయి. ఐటీ రంగంతోపాటు సినీ, వ్యాపారరంగాలకు చెందిన వారికి గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలుగా మారాయి. దీంతో హుస్సేన్‌సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతోంది. నగరంలో కాలుష్య రహితంగా, ప్రశాంత జీవనం సాగించేందుకు వీలుగా గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలైన కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ఉండడంతో అధికసంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలు గండిపేట సమీపంలో వెలుస్తున్నాయి. ఉద్యానవనం ప్రారంభోత్సవం అయితే గండిపేట తీర ప్రాంతమంతా అద్భుత పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుంది.
1200 మంది కూర్చునేలా ఓపెన్ ఎయిర్ థియేటర్
ఆధునికతకు నిలయమైన ఐటీ కారిడార్‌లో ఉన్న గండిపేట జలాశయం సమీప పార్కును అత్యాధునిక నిర్మాణ శైలితో చేపట్టారు. ఆధునికతకు కేరాఫ్‌లా ల్యాండ్ స్కేపింగ్ నిపుణులతో డిజైన్లు రూపొందించి, పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా జలాశయం తీరంలో ఒకేసారి 1200 మంది కూర్చునేలా ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను నిర్మించారు. ఇదేకాకుండా గ్రాండ్ వెల్కం (భారీ స్వాగతం) చెప్పేలా స్వాగత ద్వారాన్ని విభిన్న ఆకృతిలో నిర్మించారు. ఎంట్రెన్ పెవిలియన్‌ను 12 ఐడెంటికల్ వెల్కమ్ ఆర్చ్‌లతో డ్రైవ్వేను కాబుల్ స్టోన్‌తో నిర్మించారు. సెంట్రల్ పెవిలియన్‌లో టికెట్ కౌంటర్లు, గార్డ్‌రూమ్, ఫోర్వే కాలమ్స్ ఇన్ సెమి సర్కులర్ షేమ్, 4 మీటర్ల వ్యాసార్థంతో కూడిన గ్లోబ్‌ను మధ్యలో చూడచక్కగా ఏర్పాటు చేశారు. ఇంకా ఎంట్రెన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్టెర్రస్, పిక్నిక్ జోన్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్‌కోర్టులతోపాటు పలు రకరకాల థీమ్‌లతో నిర్మాణాలు చేపట్టారు.