బంజారాహిల్స్/హిమాయత్‌నగర్,ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం బంజారాహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన పలు బస్తీలు,కాలనీల ప్రజలు,విద్యార్థులకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తయారు చేయించిన మట్టి గణపతులను మేయర్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రమాదకరమైన రంగులతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించడం పర్యావరణానికి చెడు చేస్తుందన్నారు. మట్టి గణపతులను పూజించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ స్థానికంగా నిర్మిస్తున్న బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని కోరారు.
సర్కిల్ -18 పరిధిలో..
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలోని పలు బస్తీలు,కాలనీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణానికి హాని చేయని విగ్రహాలనే పూజించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు.
నారాయణగూడలోని మెల్కోటే పార్కులో..
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహా లక్ష్మి భక్తులకు సూచించారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ లోని మెల్కోటే పార్కులో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ శ్రీనివాస్, జి.రామన్‌గౌడ్, మల్లేశ్, సత్యనారాయణలాల్ పాల్గొన్నారు.