బడంగ్‌పేట, ఆగస్టు 29: కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ప్రధాని మోదీ అధికార మదంతో.. కుట్రపూరితంగా కూల్చుతున్నారని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలు.. ప్రజా వ్యతిరేక విధానాలతో ఎనిమిదేండ్లుగా అక్రమ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. తాజాగా ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలపై కుట్ర చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు ఎందుకు చేశారో ఎవరికీ అంతుచిక్కడం లేదని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్లకు దేశాన్ని అప్పటించే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. సామాన్య ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు.