ఆర్కేపురం, ఆగస్టు 29: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇచ్చి అండగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ రావుతో కలిసి సోమవారం నూతన పింఛన్ల కార్డులను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు 54వేల నూతన పింఛన్లు మంజూరు అయ్యాయని.. వాటిని వచ్చే నెల 2వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వృద్ధుల పింఛన్లను 57 ఏండ్లకు తగ్గిస్తూ జారీ చేస్తున్న పింఛన్లతో పాటు ఇతర వాటిని లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాకు నూతనంగా 54వేల నూతన పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరుఫున ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి: మంత్రి సబిత
టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎన్నికైన బెజ్జు పద్మావతికి సోమవారం మంత్రి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయాలన్నారు. అన్ని డివిజన్లలో పార్టీ పూర్తి స్థాయి కమిటీలు వేయాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రధాన్యత ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరే విధంగా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి, కొప్పుల రాజు, తిమ్మని గిరీశ్, శ్రీనివాస్ రెడ్డి, హరి గౌడ్, పెద్ద బావి నాగ నందీశ్వర్‌రెడ్డి, వంగేటి అశ్వీని రెడ్డి తదితరులు ఉన్నారు.