వినాయక చవితి సందర్భంగా ఏటా విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూనే ఉంది. పీఓపీ అనర్థాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో కొంతమార్పు వస్తోంది. ఈనెల 31న నిర్వహించే వినాయక చవితి కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. భారీసంఖ్యలో పీఓపీ విగ్రహాలను ఇప్పటికే తయారు చేశారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏర్పడే పర్యావరణ సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ప్రజలపై ఉంది. దీంతో ఇండ్లల్లో మట్టి వినాయకుడి విగ్రహాలను పెట్టి పూజిద్దాం.
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) వల్ల జరిగే అనర్థాలపై సర్కారుతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనికితోడు పాఠశాలలో మట్టి వినాయకుల ఆవశ్యకతను ఉపాధ్యాయులు పిల్లలకు వివరించాలి. సోషల్ మీడియాలో పలువురు వీఐపీలు మట్టి ప్రతిమలనే వాడుదామంటూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
మట్టి వినాయకులతో చాలాప్రయోజనాలు
మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటిలో సులభంగా కరిగి కాలుష్యాన్ని తగ్గించగలవు. చెరువులోని బంకమట్టిని తీయడం వల్లనీటి నిల్వ శాతం పెరిగి భూగర్భజలాలు పెంపొందించబడుతాయి. మట్టి గణపతులపై ప్రజల్లో అవగాహన నింపేందుకు సర్కారుతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ తదితర సంఘాలు జత కట్టి మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాం.
– మోతె శ్రీలత, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ