మియాపూర్, ఆగస్టు 29 : వినాయక నవరాత్రోత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఇంటా మట్టి గణపతి ప్రతిమనే పూజించాలన్నారు. వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్‌నగర్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ శ్రీనివాస్‌రావులతో కలిసి విప్ గాంధీ సోమవారం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ సిద్ధమైన వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజలకు వాడాలన్నారు. సులువుగా లభించేలా ప్రజలకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు సహా ఎక్కడికక్కడ ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు విప్ పేర్కొన్నారు. తమ క్యాంపు కార్యాలయంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి కార్పొరేటర్ కార్యాలయం ద్వారా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ మల్లారెడ్డి, డాక్టర్ నగేశ్ నాయక్, జలందర్‌రెడ్డి, పార్టీ నేతలు రఘునాథ్‌రెడ్డి, రాజుయాదవ్, శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, సత్యనారాయణ, కాశీనాథ్, అప్పిరెడ్డి, వెంకటరెడ్డి, కోటిరెడ్డి, అనీల్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడండి
మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో సోమవారం జీహెచ్ఎంసీ హెల్త్ ఆఫీసర్ కార్తిక్, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఎస్ఆర్పీ మహేశ్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి స్థానిక ప్రజలకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా సంజీవరెడ్డి, యాదగిరి గౌడ్, లక్ష్మారెడ్డి, హఫీజ్‌పేట్ గౌరవ టీఆర్ఎస్ అధ్యక్షుడు వాలా హరీశ్‌రావు, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేశ్ గౌడ్, రామ్‌చందర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజిద్దామని సోమవారం చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీ, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.