సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 28 (నమస్తేతెలంగాణ) : అనాదిగా వివక్షకు గురై.. చేతిలో చిల్లిగవ్వ లేక కూలీలు, గుమస్తాలు, డ్రైవర్లుగా బతుకీడుస్తున్న వారి జీవితాల్లో దళితబంధు పథకం వెలుగులు నింపింది. కష్టాలకు ఎదురొడ్డిన వారి బతుకుల్ని సమూలంగా మార్చింది. నాటి డ్రైవర్లు.. నేడు ఓనర్లుగా మారి సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతూ మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వెనుకబడిన దళిత కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తూ వారి భవితకు చక్కటి బాటలు వేస్తున్నారు. ఈ డబ్బులతో సొంత వ్యాపారం లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 1484 మంది, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 565 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, 95 శాతం వరకు యూనిట్లు మంజూరు చేశారు. కిరాణా, వస్త్ర దుకాణాలు, లేడీస్ ఎంపోరియం, హోటళ్లు, సెంట్రింగ్, లెదర్‌గూడ్స్, సిమెంట్ షాప్‌లు, ఫుడ్‌ట్రక్కులు, గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలు కొనుగోలు చేసి వ్యాపారంలో స్థిరపడుతున్నారు. తమ బతుకుల్ని మార్చిన దళితబంధు పథకంపై అవాకులు చెవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.
దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ద్వారా దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకంపై కొందరు కుసంస్కార వ్యాఖ్యలు చేయడంపై దళిత సమాజం మండిపడింది. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు అమలు తీరును జీర్ణించుకోలేక.., అవహేళన చేస్తూ మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో 1484 మందికి, మేడ్చల్ జిల్లాలో 565 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో దళితులు 40 రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఇందులో కిరాణషాపు, లేడిస్ ఎంపోరియం, వస్త్ర దుకాణాలు, హోటల్స్, సెంట్రింగ్, లెదర్ హుడ్స్, సిమెంట్ షాపు, ట్రక్కులు, గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలు పొంది వ్యాపారంలో స్థిరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే కండ్లుండి చూడలేక కబోధిలా మాట్లాడిన వారి విజ్ఞత ఏపాటిదో అర్థమవుతున్నదని మండిపడ్డారు. నగర వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో విజయవంతంగా పథకం అమలవుతున్నదని తెలిపారు. ప్రభుత్వ సదుద్దేశాన్ని, దళితులను అవమాన పరిచినట్లు మాట్లాడితే కర్రుకాల్చి వాతపెడుతామని హెచ్చరించారు. వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించి అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై తప్పుడు అభిప్రాయాలను వెల్లగక్కితే తరిమికొడతామని హెచ్చరించారు.
రెండవ విడతలో 2 వేల మందికి
మొదటి విడత దళితబంధు పథకం విజయవంతం కావడంతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నది. నియోజకవర్గానికి 2వేలు చొప్పున మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 10వేల మందికి దళితబంధును అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
దళితబంధుపై రాజకీయాలు దురదృష్టకరం
అధారం, ఉపాధి లేని వారికి జీవితంపై భరోసా కల్పిస్తూ దళితుల జీవితాల్లో దళితబంధు వెలుగులు నింపింది. దేశంలో మరెక్కడ లేని విధంగా తెలంగాణలో దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధుపై కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న స్వార్ధపరులు నిత్యం దళితబంధుపై విషం కక్కుతున్నారు.
– దారుగుపల్లి నరేశ్, దళితబంధు లబ్ధిదారుడు,రాయదుర్గం, శేరిలింగంపల్లి.
కిరాణా షాపు యజమాని అయ్యాను..!
రోజు కూలీ పనులు చేసుకుని పొట్ట గడుపుకునే నేను సీఎం కేసీఆర్ దయతో ఈ రోజు కిరాణా షాపు యజమాని అయ్యాను. దళితులు పనివాళ్లుగా కాకుండా.. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో పదిమందికి పని కల్పించేలా చేసి మా బతుకుల్లో వెలుగు నింపారు. ఇంత గొప్ప పథకం తీసుకువచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– జ్యోతి (లబ్ధిదారు), అన్నపూర్ణ ఎన్క్లేవ్, హరిజన బస్తీ, చందానగర్
దళితద్రోహి మీడియాలకు బుద్ధిచెబుతాం
దళిత బంధు పథకంతో ఉపాధి పొందుతున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి దళితులకు దారి చూపిన సీఎం కేసీఆర్‌తో పాటు పథకంపై అవాకులు, చెవాకులు పేలుతున్న కొన్ని దళితద్రోహ మీడియాలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధిచెబుతాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం. ఏనాడూ దళితుల గురించి పట్టించుకోలేదు. దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎంతో మందికి లబ్ధి చేకూర్చుతున్న సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– సానాధి శ్రీనివాస్, జయప్రకాశ్‌నగర్, లబ్ధిదారుడు, సికింద్రాబాద్
జీర్ణించుకోలేకపోతున్నఓ మీడియా సంస్థ
దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆహర్నిషలు శ్రమించి దళితబంధు పథకాన్ని రూపొందించారు. దశాబ్దాలుగా ఆర్థికాభివృద్ధికి నోచుకోని దళితులు దళితబంధు ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు దళితుల అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నాయి.
-కవిత, దళితసంఘ నాయకురాలు
టెంట్హౌస్తో ఉపాధి పొందుతున్నా
దళిత బంధు పథకంలో పది లక్షల టెంట్‌హౌస్ సామాగ్రి రావడంతో బొల్లారం ప్రాంతంలో షాపును ఏర్పాటు చేసుకున్నా. శుభకార్యాలు, ఫంక్షన్లకు అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నా. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నా. దళిత బంధు పథకాన్ని విమర్శించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం. వారంతా దళిత ద్రోహులకిందనే లెక్క.
– అందె శ్రీను, టెంట్‌హౌస్ యాజమాని, దళిబంధు లబ్ధిదారుడు, బొల్లారం
దళితుల అభివృద్ధిని ఓర్వలేక విమర్శలు
దళితబంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంటే ఓర్వలేని వారు దళితబంధు పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. దళితబంధు పథకంపై విమర్షిస్తే దళితులు సరైన సమయంలో బుద్ధిచెబుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంబ్కేదర్ కలలు నిజం చేయడానికే..!
అంబ్కేదర్ కలలు నిజం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడైనా ఉందా. దళితబంధు పథకాన్ని అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేలా చూడాలి. కానీ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు. దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని దళితులందరూ సంతోషంగా ఉంటారు.
-అరుణ్‌కుమార్, దళితసంఘ నాయకుడు