ఖైరతాబాద్, ఆగస్టు 28: గంగపుత్రుల సంస్కృతికి ఆలవాలంగా నిలిచే మహాక్రతువు ఆవిష్కృతమైంది. ఆడపడుచుల నెత్తిన బోనాలు.. ఒగ్గుడోలు నృత్యాలు… పోతురాజుల విన్యాసాలు… జల పందిరితో ఊరేగింపులు… తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గంగా తెప్పోత్సవ శోభాయాత్ర ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌లు హాజరయ్యారు.
శోభాయాత్ర సాగిందిలా..
ఖైరతాబాద్ కూడలిలోని ఏడుగుళ్ల సముదాయం నుంచి వేలాదిగా ఆడపడుచుల బోనాలతో, గంగపుత్రుల జల పందిరిలతో శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా పీవీ మార్గ్‌లోని గంగమ్మ దేవాలయం వరకు సాగింది. అనంతరం, అమ్మవారికి అడపడుచులు దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మంగళపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి పూస నర్సింహా, సహ కార్యదర్శి గుండు జగదీశ్ బాబు, కోశాధికారి కాపరనేని లింగం, సభ్యులు బైరు బాబురావు, మామిడి సురేశ్ కుమార్, మహిళా నాయకురాలు మల్కు అరుణ్ జ్యోతి, కొప్పు పద్మ, డాక్టర్ రమేశ్ బాబు, మెట్టు సూర్య ప్రకాశ్, జి.రమేశ్ పాల్గొన్నారు.