సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఈ ప్రాథమిక పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 213 పరీక్షా కేంద్రాల్లో 1,27,303 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,12,507 మంది హాజరయ్యారు. ఉస్మానియా వర్సిటీలోని 17 పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో..
రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ ఘట్కేసర్లోని ఆరోరా, ఇబ్రహీంపట్నంలోని గురునానక్, రామంతాపూర్‌లోని ప్రిన్స్టన్ డిగ్రీ కాలేజీ కేంద్రాలను పరిశీలించారు. ప్రశాంతమైన వాతావారణంలో పరీక్షలు జరిగాయని వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ఫిజికల్ టెస్ట్ కోసం సిద్ధం కావాలన్నారు. ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడకుండా ప్రాక్టీస్ మొదలు పెట్టాలని సూచించారు. అంబర్‌పేటలోని కార్ హెడ్ క్వార్టర్స్‌లో ఫిజికల్ టెస్ట్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, డీసీపీలు యాదగిరి, నారాయణరెడ్డి తదితర అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారని అభినందించారు.
ఓయూతో మరిచిపోలేని జ్ఞాపకాలు
కానిస్టేబుల్ రాత పరీక్ష సెంటర్‌ను సందర్శించిన నగర సీపీ ఆనంద్
సికింద్రాబాద్, ఆగస్టు 28: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) తనకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. ప్రిలిమినరీ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు ఓయూకు వచ్చినట్లు సీపీ తెలిపారు. 1989లో తాను ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని, తనకు ఇక్కడే గోల్డ్ మెడల్ వచ్చిందని, ఆ వెంటనే సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్ వచ్చిందని చెప్పారు. అప్పట్లో చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. పేద వారిని పోలీసు చేయాలనే లక్ష్యంతో ఎంతో వ్యయంతో నగరంలో ఐదు జోన్లలో 7000 మందికి మూడు నెలల పాటు ఉచితంగా ప్రీ రిక్రూట్మెంట్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. సీపీ వెంట నగర జాయింట్ సీపీ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ కాలేజీ సెంటర్లో కవిత అనే అభ్యర్థి తన చంటి బిడ్డను భర్తకు ఇచ్చి..పరీక్ష రాసేందుకు ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత పాప ఏడవడం మొదలుపెట్టడంతో..అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్వప్నలత పాపను ఒడిలోకి తీసుకొని లాలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మార్కెట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు స్వర్ణలతను అభినందించారు.
– బేగంపేట్ ఆగస్టు 28