సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న ఎస్ఆర్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్) పథకంలో 47 పనులకు గాను సింహభాగం పూర్తయ్యాయని హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. శనివారం ఎస్ఆర్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్) పథకంలో భాగంగా 45.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన చాంద్రాయణగుట్ట పై వంతెనను స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 47 పనుల్లో 70 శాతం పూర్తయ్యాయని మిగిలిన వాటిని కూడా అతి త్వరలోనే పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.
పలు వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణంతో నగరంలో రవాణా వ్యవస్థ చాలా మెరుగై ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గాయని చెప్పారు. కాగా, ఉప్పల్ నుండి ఎల్బీనగర్ మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు వీలుగా ఆ దారిలో అనేక పై వంతెనలు నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఒంటరి మహిళ పింఛన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా అగ్రతాంబూలం ఇచ్చి ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని చెప్పారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని తెలిపారు. తెలంగాణలో నెలకొన్న ప్రశాంత వాతవరణం కొన్ని దుష్టశక్తులకు కంటికింపుగా మారిందని వాపోయారు. ప్రశాంత వాతావరణంలో చిచ్చుపెట్టేందుకు కుటిల యత్నాలు చేస్తున్న వారి ఆటలు ఎప్పటికీ సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్సీ దత్తు పంత్, కార్పొరేటర్లు అబ్దుల్ వహాబ్, ఫహాద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్ధత్, మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్, చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.