సికింద్రాబాద్, ఆగస్టు 27: మట్టి గణపతి విగ్రహాలను ప్రతి ఒక్కరు పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రులు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా (టీఎస్‌పీసీబీ) ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని, మండపాల్లో, ఇళ్ళలో కూడా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజిద్దామని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా లక్షలాది మట్టి వినాయక విగ్రహాలను ఐదు నెలల నుంచి తయారు చేయించినట్లు చెప్పారు. అంతకు ముందు మంత్రులు వినాయక స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, స్వామి వారి డాలర్ లాకెట్‌ను ఆవిష్కరించారు. దీంతో పాటు కొబ్బరి లడ్డు ప్రసాద విక్రయ సేవలను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో వినోద్ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జయరాజుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.