బంజారాహిల్స్, ఆగస్టు 27: ఓ యువకుడు తీసుకొచ్చిన పిల్లి వల్ల తమకు నిద్రాభంగం కలుగుతోందని అతడితో గొడవపడి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఇద్దరు యువకులపై బంజారాహిల్స్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రంలోని శివసాగర్‌కు చెందిన ఎజాజ్ హుస్సేన్(20), బ్రాన్ స్టిల్లింగ్(20)తో కలిసి బతుకు దెరువుకోసం మూడునెలల కిందట నగరానికి వచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని మిథిలానగర్‌లో అద్దెకుంటున్నారు. ఓ వైద్యశాలలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరి గదిలోనే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌కు చెందిన హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చిట్టీ, పాలమాకుల ప్రాంతానికి చెందిన బాలుడు(17) ఉంటున్నారు. ఈనెల 20న డ్యూటీ నుంచి వస్తున్న క్రమంలో బ్రాన్ స్టిల్లింగ్కు రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న పిల్లి పిల్ల కనిపించడంతో గదికి తీసుకొచ్చాడు.
బ్రాన్ స్టిల్లింగ్, ఎజాజ్ కలిసి దానికి పాలు తాగించారు. అదే రోజు రాత్రి పీకల దాకా మద్యం సేవించిన హరీశ్వర్‌రెడ్డితో పాటు బాలుడు అర్ధరాత్రి సమయంలో పిల్లి అరుపులకు తమకు నిద్రాభంగం అవుతోందని ఎజాజ్‌తో గొడవకు దిగారు. ఆగ్రహంతో బాలుడు అక్కడే ఉన్న పెట్రోల్‌ను ఎజాజ్‌పై పోసి నిప్పంటించాడు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయని ఇంటి యజమానికి చెప్పడంతో పాటు ప్రత్యక్ష సాక్షి బ్రాన్ స్టిల్లింగ్ను కూడా బెదిరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎజాజ్ శుక్రవారం సాయంత్రం మృతి చెందడంతో పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. మద్యం మత్తులో పెట్రోల్ పోసి ఎజాజ్‌ను హత్య చేసిన బాలుడితో పాటు హరీశ్వర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.