బేగంపేట్ ఆగస్టు 27: అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రాంగోపాల్‌పేట్ డివిజన్లోని బోట్స్ క్లబ్ వద్ద ముస్లిం గ్రేవ్ యార్డ్‌లో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖబరస్తాన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి పలు సార్లు పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే నూతన విద్యుత్ స్తంభాల లైట్లను ఏర్పాటు చేసినట్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఫ్లోరింగ్, షెడ్డు అదనపు గది నిర్మాణం, ఇతర పనులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఖబరస్తాన్ కమిటీ సభ్యులు అసియా రోహి, బాబా షేక్ దావూద్, హిది మాతుల్లా, మహ్మద్ సాధిక్, రహిం తదతరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన పవర్ లిఫ్టింగ్ విజేతలు
అమీర్‌పేట్, ఆగస్టు 27 : వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 21న షేక్‌పేట్‌లో నిర్వహించిన తెలంగాణ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విజేతలు నిర్మల, కోటమ్మ శనివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సనత్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ వాల్మీకీ వ్యాయామశాలలో కోచ్ రవిబిడ్లాన్ పర్యవేక్షణలో పవర్ లిఫ్టింగ్ సాధన చేసిన కోటమ్మ 52 కేజీల విభాగంలో, నిర్మల 79కేజీల విభాగాల్లో పోటీ పడి మొదటి బహుమతులు గెలుచుకున్నారు. ఈ మేరకు కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి కోచ్ రవిబిడ్లాన్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ శిక్షణలో నాలుగు దశబ్దాల కాలంలో సనత్‌నగర్‌లోని వాల్మీకి వ్యాయామశాల అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.