ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభ ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం 150 మంది కూర్చునేలా సభా వేదికను సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వచ్చే జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా 20 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరానున్నారు.
మరోవైపు మామిడి తోరణాలు, పూలు, లైటింగ్స్‌తో నూతన కలెక్టరేట్‌ను ముస్తాబు చేశారు. అదేవిధంగా సీఎం రాక సందర్భంగా 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లతోపాటు బహిరంగ సభ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ డి.అమయ్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు.
సాధారణంగా ప్రతీ జిల్లాకు అదే జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. కానీ రంగారెడ్డి జిల్లాకు 44 ఏండ్ల తర్వాత జిల్లాలోనే కలెక్టర్ కార్యాలయం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అయింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండడం గమనార్హం. చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డితోపాటు వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయా జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను కూడా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లా ప్రజల కల నెరవేరింది. ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలోని లక్డీకాపూల్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నేటి నుంచి రంగారెడ్డి జిల్లా పరిధిలో అందుబాటులోకి రానుంది.
జిల్లా సమీకృత కలెక్టరేట్ గురువారం ప్రారంభం కానుండడంతో అన్ని శాఖలు ఇకపై ఒకే సముదాయం నుంచి పాలనను కొనసాగించనున్నాయి. పోలీస్, అగ్నిమాపక, రవాణా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖలు మినహా మిగతా అన్ని శాఖల కార్యాలయాలను సమీకృత కలెక్టరేట్లోనే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు లక్డీకాపూల్‌లో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య, జిల్లా ఖజానా శాఖ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. అయితే సమీకృత కలెక్టరేట్ సముదాయం అందుబాటులోకి రానుండడంతో అన్ని శాఖలు ఒకేచోటుకి రావడంతోపాటు జిల్లా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రజలు ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ఈజీగా కలెక్టరేట్‌కు చేరుకోవచ్చు.
కలెక్టరేట్ సముదాయాన్ని గురువారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కొంగరకలాన్‌కు చేరుకుని మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. సర్వమత ప్రార్థనలు పూర్తయ్యాక అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం నూతన కలెక్టరేట్‌కు సమీపంలో సిద్ధం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
– రంగారెడ్డి, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ)