సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సేవలందించడంలో పోలీసులకు సహకరించే సాధారణ పౌరుల సేవలను గుర్తించి వారికి తగిన రివార్డులు అందజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతిభ కనబర్చిన 300మంది పోలీస్ సిబ్బందికి, ఇద్దరు సాధారణ పౌరులకు రివార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలకోసారి సిబ్బంది పనితీరును గుర్తించి ప్రతిభ ఆధారంగా వారికి రివార్డులు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో పోలీసులకు తమ వంతు సహకారాన్ని అందించే వారిని గుర్తించి వారికి కూడా రివార్డులు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా ఫేక్ న్యూస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో రియాజుద్దీన్, కొవిడ్-19 సమయంలో పోలీసులతో కలిసి సేవలు అందించిన గౌతమ్ జలాండ్కు సీపీ రివార్డులు అందించారు.