మతవిద్వేష వ్యాఖ్యలు చేయడం.. రెచ్చగొట్టడం.. ఆ తర్వాత నానా హంగామా చేయడం.. తద్వారా రాజకీయ లబ్ధి పొందడం..ఆది నుంచి బీజేపీ అవలంబిస్తున్న ఆచారం..ఏదో విధంగా లాభపడాలనే పన్నాగం..నగర ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణలో చిచ్చుపెట్టి రచ్చ చేయడమే ఎజెండాగా పనిచేస్తున్న ఆ పార్టీ నాయకుల విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయంగా అధికార పార్టీని ఢీకొనలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడటంతోపాటు మతకల్లోలం సృష్టించే యత్నం చేస్తున్నారని భగ్గుమంటున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీస్ వ్యవస్థను నెలకొల్పింది. మహానగరంలో అన్ని మతాల వారు ప్రశాంతంగా మనగలిగే వాతావరణాన్ని తీర్చిదిద్దడంతో అనేక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని భగ్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ నానా యాగి చేస్తున్నదని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్.. గంగాజమునా తెహజీబ్. మతసామరస్యానికి ప్రతీక.. ఎనిమిదేండ్లుగా ఇక్కడ ఒక్క మత ఘర్షణ కూడా లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకం సంతోషంగా ఉన్నది. అసాధారణ అభివృద్ధి సాధ్యమైంది. ఇంతటి ప్రశాంత వాతావరణం బీజేపీకి నచ్చడం లేదు. తమ పార్టీ అభివృద్ధి కోసం, సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది…ఉత్తమ నడవడికతో భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ పార్టీ నాయకులు సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించడం రాజకీయాలకే మచ్చలా తయారైంది.
రాజకీయ క్షేత్రంలో అధికార పార్టీని కనీసంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడటమే కాకుండా మత కల్లోలాలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న జాతీయ పార్టీ బీజేపీ తీరుపై హైదరాబాద్ జనం భగ్గుమంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అశాంతిని నెలకొల్పేందుకు బీజీపీ పన్నిన పన్నాగం మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేష వ్యాఖ్యలు చేసి ప్రశాంత వాతావరణాన్ని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళనలను సద్దుమణిగించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారు.
ప్రశాంతతను చెడగొట్టే కుట్రలు
నగరంలో ఏ చిన్న వివాదం జరిగినా అది మత ఘర్షణలకు దారి తీసి.. దాడులు.. హత్యలు.. చివరకు కర్ఫ్యూ విధించే పరిస్థితిలు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉండేవి. ఆ సమయంలో ఎప్పుడే ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోననే ఆందోళనతో నగరవాసులు బిక్కు బిక్కుమంటూ గడిపిన రోజులున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలపైనే ప్రధాన దృష్టి పెట్టి పోలీస్ వ్యవస్థను ఆధునీకరించారు. హైదరాబాద్‌లో ప్రశాంతత వెల్లివిరిసేలా సామరస్య వాతావారణాన్ని సృష్టించగలిగారు. ఎనిమిదేండ్లుగా హైదరాబాద్‌లో మతపరమైన ఆందోళనలు లేవు. ప్రజలంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నారు. శాంతి భద్రతలు బాగుండడంతో ప్రపంచ దేశా లు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఉంటూ ఒకరికొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండడంతో భారతదేశంలోని అన్ని రాష్ర్టాల వారికి ఇది ఇష్టమైన నగరంగా మారింది.
రెచ్చగొట్టి.. అశాంతిరేపి
పోలీస్ వ్యవస్థను టెక్నాలజీ పరంగా ప్రభుత్వం ఆధునీకరించడంతో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పటిష్టమైన పెట్రోలింగ్‌తో బలమైన పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ నగరంలో ఉంది. సోషల్‌మీడియాను వేదికగా చేసుకుంటూ కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని నెలకొల్పేందుకు పలు రకాలైన రెచ్చగొట్టే పోస్టులు వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సారి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ విద్వేషాలు సృష్టించి, రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టింగ్‌లపై తరుచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై కేసులూ నమోదువుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. దానిపై కొన్ని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాచకొండలో న్యాయ సలహాల అనంతరం చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్‌భగవత్ ప్రకటించారు.
అమిత్ షా పర్యటన తరువాతే ఇదంతా..
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ పాతబస్తీలో సర్జికల్ స్రె్టైక్స్ అంటూ ఉద్రిక్తతలని పెంచేందుకు ప్రయత్నం చేశారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ మానుకోవాలి. గంగా జమునా తహజీబ్‌కు మారుపేరు అయిన హైదరాబాద్‌లో ఇలాంటి చిల్లర ప్రయత్నాలు ఫలించవు.
– గద్వాల్ విజయలక్ష్మి, మేయర్, జీహెచ్ఎంసీ
చిచ్చుపెట్టడమే బీజేపీ పని
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించడమే కాషాయ పన్నాగంగా కనిపిస్తుంది. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న బీజేపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలి.
– జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి
ఎన్నికలొస్తే చాలు..మతగజ్జి లేపుతరు
బీజేపీ దుర్మార్గ, అనారోగ్యకర, అనాలోచిత విధానాలతో సంకుచిత రాజకీయాల కోసం మతోన్మోదాన్ని రెచ్చగొడుతున్నది. ఎన్నికలప్పుడే మతగజ్జి లేపడం బీజేపీ చిల్లర షార్ట్ కట్మెథడ్. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 8 సంవత్సరాలుగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యారు. నిరంతర విద్యుత్, సమృద్ధిగా నీరు, మెరుగైన వసతులు కావాలనుకుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ పక్షాన నిలబడుతూ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు. బీజేపీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా ఉన్నారు. ఇది ఓర్వలేని బీజేపీ నాయకులు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. విద్వేషాలు రెచ్చగొడితే ప్రజలే బీజేపీకి సరైన బుద్ధి చెబుతారు.
– చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
కల్లోలాలు సృష్టించేందుకే..
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నది. 8 సంవత్సరాలుగా ఐకమత్యంగా ఉన్న గ్రేటర్లో మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సంతృప్తికరంగా ఉన్నామని ప్రజలు చెబుతుంటే ఓర్వలేక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీజేపీ నేతల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా ప్రజలే బీజేపీ నేతలను గ్రేటర్లో తిరగన్వికుండా చేస్తారు.
– మాగంటి గోపినాథ్ హైదరాబాద్ , జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
రెచ్చగొట్టొద్దు..
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
గౌతంనగర్, ఆగస్టు 23 : సమాజం అభివృద్ధిని కోరుకుంటుందని, మతతత్వాన్ని రెచ్చగొట్టొద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ అన్ని మతాలు, కులాలు, వర్గాలు సమానమే, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటున్నారన్నారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీలైనా, నాయకులైనా మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయన్నారు.
ఎవరూ మత సంబంధమైన వ్యాఖ్యలను చేసి వారి మనోభావాలను దెబ్బతీయరాదన్నారు. ప్రజలందరూ స్నేహ సోదరభావంతో జీవించడమే కోరుకుంటున్నారు. ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్న నేపథ్యంలో నాయకులు కూడా ప్రజల అభిమతం మేరకు పని చేయాలన్నారు. మౌలికి వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు ముందుకు సాగాలన్నారు. ఎవరైనా మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు.