కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 23 : ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎన్.పోచమ్మ (58) బతుకుదెరువు కోసం నగరానికివచ్చి కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్నగర్లో నివాసముంటూ పారిశుధ్య కార్మికురాలిగా గత 15ఏండ్లుగా పనిచేస్తున్నది.
భర్త వెంకయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా పోచమ్మ కార్మికురాలిగా పనిచేస్తూ ముగ్గురు కూతుర్లకు వివాహాలు చేసింది. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు పోచమ్మతోనే నివాసముంటున్నారు. కాగా.. మంగళవారం జేఎన్టీయూహెచ్ ప్రగతినగర్ రోడ్డులోని అడ్డగుట్ట సొసైటీలో తోటి కార్మికులతో కలిసి విధి నిర్వహణలో భాగంగా రోడ్లను శుభ్రం చేస్తుండగా ప్రగతినగర్ నుంచి జేఎన్టీయూహెచ్ వైపు వస్తున్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పోచమ్మను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన పోచమ్మను సమీపంలోని వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు, మృతురాలి బంధువులు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి సీబీఐటీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని ఆందోళన చేశారు. ఈ సంఘటనలో బస్సును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.