బడంగ్‌పేట, ఆగస్టు 23: విద్యార్థులు కష్టపడి చదువుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సిర్లాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలను ఎడ్యుకేషన్ చైర్మన్ ఓమర్ జలీల్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి సబితారెడ్డి మంగళవారం ప్రారంభించారు.
అనంతరం, విద్యార్థులకు నోట్ బుక్స్, అకాడమిక్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యి గురుకులాలు, 1150 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను అప్ గ్రేడ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని, యూనివర్సిటీలలో 60 నుంచి 80 శాతం వరకు అమ్మాయిలు చదువుకుంటున్నారని ఆమె తెలిపారు.
ప్రతి కళాశాలలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. మీర్‌పేటలో జూనియర్ కళాశాల, తుక్కుగూడలో పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సైదులు, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈఈ గోపీనాథ్, కార్పొరేటర్లు, అధ్యాపకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.