శామీర్‌పేట, ఆగస్టు 23: వివిధ అంశాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించడంలో ఫొటోగ్రఫీ దశాబ్దాలుగా మనకు ఎంతో దోహదపడిందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) – తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్(టీఈఎఫ్ఏ) సంయుక్తంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని తూముకుంట మున్సిపాలిటీలోని అలంకృత రిసార్ట్స్‌లో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చరిత్రను నిక్షిప్తం చేయడంలో సామాజిక జీవితంలోని వివిధ అంశాల గురించి జ్ఞానాన్ని పెంపొందించడంలో ఫొటోగ్రఫీ దశాబ్దాలుగా మానవాళికి ఎంతో దోహదపడుతున్నదని పేర్కొన్నారు. సాంకేతికత విస్తృతంగా అభివృద్ధి చెందినందున శస్త్ర చికిత్సలు, ఔషధాల వంటి మరెన్నో క్లిష్టమైన ఉపయోగాల కోసం ఫొటోగ్రఫీని ఉపయోగించుకునే సామర్థ్యం ఇప్పుడు మనకు ఉన్నదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోగ్రఫీకి చెందిన కొంతమంది ప్రముఖుల కృషిని గుర్తించినందుకు టీసీఈఐ-టీఈఎఫ్ఏలను అభినందించారు. అనంతరం, ఫొటోగ్రఫీ బిజినెస్ కోచ్ అయిన అబ్దుల్లా అన్సారీ గెస్ట్ స్పీకర్‌గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో టీసీఈఐ వ్యవస్థాపకుడు సూరత్‌సింగ్ మల్హోత్రా, విక్టరీ ఫొటో సెంటర్ వ్యవస్థాపకుడు, వెటరన్ లెన్స్‌మ్యాన్ మదన్ చంద్ జైన్, టీసీఈఐ అధ్యక్షుడు మనోజ్ కుమార్ ఇనాని, టీఈఎస్ఏ ఉపాధ్యక్షుడు నీరూ మోహన్, కార్యదర్శి సందీప్ జైన్, సహాయ కార్యదర్శి అజ్మత్ అలీ, టీఈఎఫ్ఏ కోశాధికారి పవన్ అగర్వాల్, ఈసీ సభ్యులు విపాషా కిరణ్, జిగ్నా మెహతా, వాసిఫ్ అక్తర్, సంత్ రోహిత్, ఫొటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రతిభావంతులు పాల్గొన్నారు.