సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని దేశమంతా వ్యాపించాలని కోరుకున్న గాంధీ సందేశాన్ని ఈతరానికి తెలియజెప్పాలని సాహిత్య అకాడమి చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అభిష్టం మేరకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్యిందని ఆదివారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆయన తెలిపారు. కులం, మతం పేరున సమాజాన్ని ముకలు చేసే యత్నాలు చేసే విషపు భావజాలాలను తిప్పికొట్టేందుకు పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. మనిషిని మనిషి ప్రేమించే సామాజికతత్వాన్ని లౌకికతత్వాన్ని మనిషి ఎదలో నాటడానికి పుస్తకాలు సామాజిక కార్యకర్తల్లా పనిచేస్తాయని పేరొన్నారు. మానవత్వం, మత సామరస్యాన్ని చాటిచెప్పే గాంధీ బోధనలను ఈతరం భుజాలకెత్తుకున్నప్పుడే భవిష్యత్ భారత సమైక్యత మరింత పటిష్టంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ఈనెల 8 నుంచి 21వ తేదీ వరకు 22 లక్షల మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని చూడటం భావితరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముగింపు సభకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అధ్యక్షత వహించగా.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గౌరవ సలహాదారు ఎంబీ గోనారెడ్డి, నిర్వాహకులు యానాల ప్రభాకర్‌రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు శృతికాంత్ భారతి, రచయిత మనోహర చారి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు కావాల్సింది గాంధీ జాతీయవాదం
గాంధీ జాతీయవాదానికి, హిందూ జాతీయవాదానికి ఎంతో తేడా ఉన్నదని ప్రముఖ చరిత్రకారుడు జితిన్బాబు అన్నారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందూ జాతీయవాదంలో మైనారిటీలు, ముస్లింలు లేరని, కానీ గాంధీ జాతీయవాదంలో మైనారిటీలు, ముస్లింలు, వెనుకబడిన అణగారిన వర్గాలు అందరూ ఉన్నారని గుర్తుచేశారు. గాంధీజీ ప్రతి ఒకరినీ స్వాతంత్రోద్యమంలో లింగ, మత, ప్రాంత, వర్గభేదం లేకుండా భాగస్వాములను చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశానికి ఫాసిస్టు రాజకీయాలతో ప్రమాదం ఏర్పడిందని అన్నారు. నేడు కొందరు గాంధీని ముందు పెట్టుకొని కొత్త రాజకీయం చేస్తున్నారని, మనం గాంధీని తిరిగి పునర్ ప్రతిష్ఠించుకోవాల్సిన, పునరధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేరొన్నారు. దకన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమ ఘట్టాలు, గాంధీ బోధనలు ప్రతిబింబించేలా వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను తీర్చిదిద్దడం ఆకర్షణీయంగా ఉన్నదని అన్నారు. పుస్తక ప్రాముఖ్యతను ప్రచారం చేయడంలో తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వేదకుమార్, జితిన్ బాబులను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సెక్రటరీ కోయ చంద్రమోహన్ శాలువాతో సతరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.