సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఆదివారం హెచ్ఎండీఏ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ పార్కులు, సంజీవయ్య పార్కులు నెక్లెస్ రోడ్డు, కోకాపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.ఎం.సంతోష్, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అదే సమయంలో ఘట్కేసర్, శంషాబాద్ ఇంటర్చేంజ్, కేఎల్ఆర్ ట్రీ పార్కు, ర్యావిర్యాల, ఫ్యాబ్‌సిటీ, పెద్ద అంబర్‌పేట ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 19 ఇంటర్‌చేంజ్‌లతో పాటు 46 చోట్ల అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో 14లక్షలకు పైగా మొక్కలను ఒకే రోజు నాటారు. 6 ప్రాంతాల్లో మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో 13 లక్షలు, 16 చోట్ల బ్లాక్ ప్లాంటేషన్‌లో 14.33 లక్షలు, చెరువులు అభివృద్ధి చేసిన 3 ప్రాంతాల్లో 52వేల మొక్కలను నాటారు. అలాగే ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సండే ఫన్డే కార్యక్రమంలో నగరవాసులకు సుమారు 30వేల మొక్కలను ప్రత్యేకంగా కౌంటర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు.