జూబ్లీహిల్స్,ఆగస్టు21: మండపాలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్వాహకులు అనుమతి పత్రం తీసుకుని విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. 6 ఫీట్లకంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను ఏర్పాటుచేసుకుంటే విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో మండప నిర్వాహకులతో సమావేశమయ్యారు. మండపాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపంలో రాత్రివేళ నిర్వాహకులలో కనీసం ముగ్గురు ఉండాలని సూచించారు. మండపం నిర్వహణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాన్ని పోలీస్ స్టేషన్లో అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ లు డాలి నాయుడు, చంద్రశేఖర్, నర్సింగ్‌రావు, రాజశేఖర్, నాగరాజు, కృష్ణవేణి, అభిషేక్, రాకేశ్ పాల్గొన్నారు.
వెంగళరావునగర్‌లో…
నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు సూచించారు. ఆదివారం గణేశ్ మండప నిర్వాహకులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, బస్తీ నాయకులతో పోలీసు స్టేషన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ..వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఉత్సవ విగ్రహాలకు సంబంధించి రూట్ మ్యాప్‌లను కూడా తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.