అంబర్‌పేట, ఆగస్టు 21: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం గోల్నాక డివిజన్ అంబేద్కర్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న గంభీరావుపేట గంగపుత్ర సంఘం హైదరాబాద్ శాఖ భవన నిర్మాణ పనులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అన్ని కులాల ఆత్మగౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కుల సంఘా ల భవనాలకు స్థలంతో పాటు వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. అంబర్‌పేటలో గంభీరావుపేట గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సంఘ భవన అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మంగిలిపల్లి యాదయ్య, సలహాదారులు ఆవునూరి ఎల్లయ్య, లక్కంపెల్లి లింగయ్య, పేరట్ల నర్సింగ్‌రావు, పేరట్ల బాలయ్య, పంపరి రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఆవునూరి రామకృష్ణ, కోశాధికారి కాముని గంగాధర్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలేరు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ, బస్తీలు, ఖాళీ స్థలాలలో మొక్కలను నాటారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేశారు. కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్‌యాదవ్, డీసీ వేణుగోపాల్‌తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మొక్కలను నాటారు.
అదే విధంగా గోల్నాక డివిజన్ వీరన్నగుట్ట మహా శివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. పార్టీ సీనియర్ నాయకు డు దూసరి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానికులు స్వరూప, అనిత, లలిత తదితరులు పాల్గొన్నారు.