కవాడిగూడ, ఆగస్టు 20 : గుజరాత్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు నేరస్తులకు క్షమాబిక్ష విడుదలను వెంటనే రద్దు చేయాలని ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ కన్వీనర్ కాకర్ల సజయ, పీఓడబ్ల్యూ సంధ్య డిమాండ్ చేశారు. రేపిస్టులను విడుదల చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో గుజరాత్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు ఖైదీల విడుదలను నిరసిస్తూ ముస్లిం మహిళలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ప్ల-కార్డులను చేతబూని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోను రేప్ చేసి, ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న కిరాతకులను ఎంతో పవిత్రంగా భావించే స్వతంత్ర దినోత్సవం నాడు విడుదల చేసి ప్రపంచం ముందు భారత దేశం పరువు తీసిన బీజేపీ ప్రభుత్వం వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విడుదల చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.