సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : అసలే పేదరికం.. కన్న పేగుకు తీరని కష్టం.. ఆ కుటుంబాన్ని కలిచివేసింది. తమ కూతురును కాపాడాలంటూ ఆ దంపతులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించారు. ఆ సంస్థ విజ్ఞప్తి, మంత్రి హరీశ్ రావు చొరవతో పాపకు ఉచితంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రాణదాతలుగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం, గుగునవెల్లి గ్రామానికి చెందిన ఏకల సురేశ్, సోని దంపతులకు ఆడ శిశువు జన్మించింది. ప్రస్తుతం పాప ఆరాధ్య వయస్సు రెండు నెలలు కాగా, పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. పలు దవాఖానలకు తిరిగారు. రెయిన్ బో ఆస్పత్రిలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూ ప్రాణాపాయ స్థితికి చేరుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో ఏమి తోచని స్థితిలో దంపతులిద్దరూ పురాణా హవేలీలో ఉన్న హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గత నెల (జూలై) 22న సంప్రదించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా ఆ చిన్నారికి వైద్య సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి లేఖలు రాశారు.
మంత్రి హరీశ్ రావు చొరవతో..
హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాపకు అదే దవాఖానలో శస్త్ర చికిత్స జరిగేలా చర్యలు చేపట్టాలని అరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో గత నెల 26న పాప ఆరాధ్య గుండెకు ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. పాప పూర్తిగా కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తమ బిడ్డను కాపాడిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పాపకు తక్షణ గుండె శస్త్ర చికిత్స కోసం చొరవ చూపించిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చీఫ్ జడ్జి రేణుక యారా ధన్యవాదాలు తెలిపారు.