ఖైరతాబాద్, ఆగస్టు 20 : దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడమే కాదని, గుండెల్లో దేశభక్తిని నింపుకోవాలని ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సివిల్ రైట్స్(ఐఎంసీఆర్) ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీ య కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, నెహ్రూ ఎడ్యూకేషన్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ అజాం బేగ్, సుప్రీం కోర్ట్ న్యాయవాది ఫజల్ ఆయుబీతో కలిసి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి మెలిసి ఉండేలా, రాజ్యాంగ పరిరక్షణ, భారతదేశ అభివృద్ధికి ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సివిల్ రైట్స్ కృషి చేస్తున్నదని తెలిపారు. మరో ఎనిమిది నెలల తర్వాత హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. ‘సబ్ కా సాత్.. సబ్ వికాస్’ అని చెబుతున్న ప్రధాని మోదీ, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక వ్యవస్థ దివాళ తీస్తోందని, మన దేశం బంగ్లాదేశ్ దేశం కంటే వెనుకబడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫజల్ ఆయుబీ మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక, న్యాయ వ్యవస్థల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పౌర హకులను కాలరాస్తున్నారని విమర్శించారు. అత్యాచార దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ సమావేశంలో మజీ ఎంపీ మహ్మద్ అదీబ్, సెంట్రల్ వాటర్ రిసోర్స్ మాజీ చైర్మన్ మసూద్ హుసేన్, హెల్ప్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎస్.జి.ఎం ఖాద్రీ, సామాజిక కార్యకర్త కనెల్ జఫ్రి, ఐఎంసీఆర్ జాతీయ కన్వీనర్ జాహిద్ ఖాద్రీ పాల్గొన్నారు.