బాలానగర్, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్రం బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్ ఫార్మాస్యూటికల్స్ తయారీలో దేశంలోనే అగ్రగామిగా నిలువాలని భావిస్తున్నదని రాష్ట్ర ఇండస్ట్రీస్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. శనివారం బాలానగర్ పారిశ్రామికవాడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు కేంద్ర ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎన్.యువరాజ్, రాష్ట్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ ముర్తూజా రిజ్వీ, బల్క్ డ్రగ్ మానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్, నైఫర్ డైరెక్టర్ శశిబాలాసింగ్, డీడీసీ ఎ.రామకిషన్, బీడీఎంఏ జనరల్ సెక్రటరీ అనూప్ వీర్‌తో పాటు పలు ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ అనే కొత్త పారిశ్రామిక ఎస్టేట్‌ను రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని పేర్కొన్నారు.
ఫార్మాస్యూటికల్ రంగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఫార్మాహబ్‌గా మారనున్నదని ఆయన స్పష్టం చేశారు. రూ.500 కోట్ల నిధుల కేటాయింపుతో ఫార్మా పరిశ్రమకు నాణ్యత, నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయదలచినట్లు తెలిపారు. నాణ్యమైన బల్క్ డ్రగ్స్ ఫార్ములేషన్స్ ఉత్పత్తి కోసం ఫార్మా తయారీదారులందరినీ ఒక యూనిట్‌గా చేసి బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ డ్రగ్ రెగ్యులేటింగ్ ఏజెన్సీలు, పలు ఫార్మా పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో పాటు డ్రగ్ కంట్రోలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.