సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ద్వి సప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ ఆశయాలు, భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన మంచి సందేశాన్ని సమాజానికి అందించిందని పేర్కొన్నారు. ‘ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సందర్శించారు. మొదట మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాల స్టాళ్లను సందర్శించారు. అలాగే, ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరకను, చేనేత మగ్గాన్ని, గానుగ యంత్రాన్ని ఆసక్తిగా తిలకించి, నిర్వాహకులతో మాట్లాడారు. పుస్తక ప్రదర్శన నిర్వాహకులను అభినందించారు. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చరకను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సెక్రటరీ కోయ చంద్రమోహన్, యానాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ బోధనకు నిలయం: ఎమ్మెల్సీ ఎల్.రమణ
వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు సందర్శించారు. మహాత్మాగాంధీ బోధనకు నిలయంగా పుస్తక ప్రదర్శనను తీర్చిదిద్దారని ఎల్.రమణ అన్నారు. జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్‌తో కలిసి మగ్గం వడికారు. మహాత్మా గాంధీ సిద్ధాంత భావజాల స్ఫూర్తిగా వజ్రోత్సవ వేళ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.