అబిడ్స్, ఆగస్టు 20 : యువతకు అసాధ్యమైనది ఏదీ లేదని.. దేశ ఐక్యత, అభివృద్ధికి పాటుపడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్‌రావు అన్నారు. ఆధునిక టెక్నాలజీతో గుణాత్మక విద్యను అందిపుచ్చుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ జీవన స్థితిగతులను మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. శనివారం బొగ్గుకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన దినోత్సవం ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెనాలి శాఖ అధ్యక్షురాలు ఎం.భానుమతి మాట్లాడుతూ..యువత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలరన్నారు. మైనార్టీ మోర్చా కోశాధికారి, బాలీవుడ్ నటుడు డాక్టర్ షేక్ రమ్మతుల్లా మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మేజర్ జయసుధ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి 2000 సంవత్సరం ఆగస్టు 12న యువజన దినోత్సవంగా జరుపుకోవాలన్న సూచనల మేరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 40 ఏండ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.ల యన్స్క్లబ్ అధ్యక్షుడు ప్రేమ్‌చంద్ మునోట్ జైన్, టి.సి.సి. రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొటెల్ రాహుల్ పరమేశ్వర్ యాదవ్, నగర అధ్యక్షుడు ఎన్.ఆర్.లక్ష్మణ్‌రావు గుప్తా, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎ.ఉదయశ్రీ, అమీర్, పీస్ ఫౌండేషన్ (యూఎస్ఏ) చికాగో అధ్యక్షుడు ఫారూక అలీ ఖాన్, ఢిల్లీ శివకుమార్, బత్తుల హేమంత్, జోమియా షహీన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గ్లోబల్ యూత అవార్డు గ్రహీతలు ఎం.కామరాజు, సుచరితా జాన్, ప్రతాప్ నాగరాజు, కె.మేఘనా సుప్రియ, యోగిరాజువైద్య, కుమారి మద్ది మనిదీప రెడ్డి, ఆర్.బిందుస్నేహ, యశ్వంత్ కుమార్ యాదవ్, కుమారి దుర్గ, అబ్సర్ అహ్మద్, సాద్వివర్మ తదితరులను శాలువ, పూలమాలతో సత్కరించి యువజన అవార్డులు ప్రదానంచేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పొటేల్ ఐశ్వర్యయాదవ్ నృత్యంతో పాటు వివిధ కళాశాలల విద్యార్థినులు దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలతో అలరించారు.