కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 20 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వజ్రోత్సవ కార్యచరణలో భాగంగా ఈనెల 21న పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కాలనీలు, బస్తీలలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములయ్యేలా కార్యచరణను సిద్ధం చేశారు. అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధికారులు సర్కిళ్లు, కాలనీలు బస్తీల వారీగా మొక్కలు నాటేందుకు అణువైన ప్రాంతాలను గుర్తించారు.
జోన్లో ఐదు లక్షల మొక్కలు..
వన మహోత్సవంలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఐదు లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్కిల్‌కు లక్ష చొప్పున ఐదు సర్కిళ్లలో కలిపి ఐదు లక్షల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కాలనీలు బస్తీల వారీగా ఖాళీ ప్రదేశాలను గుర్తించి నేడు మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే హరితహారంలో మహిళా సంఘాలను భాగస్తులను చేస్తూ క్లస్టర్ల వారీగా మొక్కలు నాటి సంరక్షించే పనులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వన మహోత్సవంలో ఐదు సర్కిళ్ల పరిధిలోని 480 కాలనీలలో మొక్కలు నాటేందుకు అణువైన ప్రాంతాలను గుర్తించారు. 48 క్లస్టర్లలోని సుమారు 350 కాలనీలలో మహిళా సంఘాలు మొక్కలు నాటనున్నారు. కాలనీలు బస్తీలలోని పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన, రోడ్డు డివైడర్లు, శ్మశానవాటికలు, చెరువుల బఫర్ జోన్లలో మొక్కలు నాటనున్నారు.