వెంగళరావునగర్, ఆగస్టు 19: శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతూ.. తల్లిందండ్రుల ప్రేమకు నోచుకోని చిన్నారులను చూసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చలించిపోయారు. పిల్లల పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన ఒక దశలో కంటతడి పెట్టుకొన్నారు. ముద్దులొలికే పసి పిల్లలను వదిలివేయడానికి ఆ తల్లిదండ్రుల మనసెలా ఒప్పిందోనని మదనపడ్డారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్‌లో ఉన్న స్టేట్‌హోం ఆవరణలోని శిశువిహార్‌ను ఉన్నతస్థాయి అధికారుల బృందంతో కలిసి సందర్శించారు.
ముద్దులొలికే చిన్నారులు చిన్ని కృష్ణుడి వేషధారణలో సీఎస్‌కు ఘనస్వాగతం పలికారు. చిన్నారులను చూసి సీఎస్ భావోద్వేగానికి లోనయ్యారు. పిల్లలను చూసేందుకు తన సతీమణిని కూడా శిశువిహార్‌కు తీసుకొస్తానని తెలిపారు. శిశువిహార్‌లో పిల్లలకు అందుతున్న సౌకర్యాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ వివరించారు.
శిశువిహార్ పనితీరులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అధికారులు సీఎస్‌కు తెలిపారు. శిశువిహార్ పనితీరుపై సోమేశ్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పిల్లల సాంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సీఎస్ పిల్లలకు పండ్లు, చాక్లెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి, సునంద, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు, ఆర్జేడీ శారద, ఏడీ పద్మజా, స్వరూప, సీడీపీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.