అబిడ్స్, ఆగస్టు 19: ఎల్బీ స్టేడియంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22న మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో 3 గంటల నుంచి ప్రారంభమయ్యే ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకులు శంకర్ మహదేవన్, శివమణిల సంగీత విభావరి ఉంటుందన్నారు.
ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 25 వేల మందికి పైగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీసు కమిషనర్ శర్వానంద్, ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, టీఎస్ఐసీసీ ఎండీ నర్సింహా రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన జనగణమన
రవీంద్రభారతి, ఆగస్టు 19: మాంగల్య ఫౌండేషన్, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌కు చెందిన అర్చన ఐదు చరణాలతో కూడిన సంపూర్ణ జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మాంగల్య ఫౌండేషన్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించి అందరిని అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ మాంగల్య ఫౌండేషన్ అధ్యక్షురాలు అర్చనను అభినందించి, ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, గౌడ హాస్టల్ చైర్మన్ పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కూచిపూడి నృత్యం ప్రేక్షకులను అలరించింది.