సుల్తాన్‌బజార్/మాదాపూర్/ బంజారాహిల్స్/ ఆగస్టు 19: నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. పాఠశాలలకు రాధాకృష్ణుల వేషధారణలతో వచ్చిన చిన్నారులు నృత్యాలు చేస్తూ అలరించారు. అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్లో ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ ట్రస్టీ సభ్యులు పరమ పూజ్య శ్రీ జయ పతాక స్వామి మహారాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1978 నుంచి దక్షిణ భారతదేశంలోని వంద ఇస్కాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది అబిడ్స్ ఇస్కాన్‌లో మూడు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ వరద కృష్ణదాస్, కో-ఆర్డినేటర్ శంభు వైష్ణవదాస్ తెలిపారు.
మాదాపూర్‌లోని అన్నమాచార్య భావనావాహినిలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అన్నమయ్యపురం వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, డాక్టర్ శోభరాజు ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాత్విక బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం సందర్శకులను ఆకట్టుకున్నది.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వర్ణ దేవాలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ రాధాగోవిందులకు 108 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. 64 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు. స్వామివారి ఊంజల్ సేవా కార్యక్రమంలో వందలాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణ తత్వాన్ని వివరిస్తూ సాగిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యచంద్రగౌరదాస భక్తి ప్రవచనాలు చేశారు.