సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరిగేలా క్షేత్ర స్థాయి నుంచి సిబ్బంది సిద్ధం కావాలని సీపీ సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు. సోషల్‌మీడియాలో వచ్చే వదంతులు, తప్పుడు పోస్టులపై నిఘా పెట్టాలన్నారు. గణేశ్ నవరాత్రి వేడుకలు, నిమజ్జనోత్సవంపై డీసీపీలు, పలువురు ఎస్‌హెచ్‌వోలతో బుధవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ విగ్రహాలు, నిమజ్జనం ఏర్పాట్లపై నిర్వాహకులు పోలీసులకు తగిన సమాచారం ఇస్తూ అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విగ్రహం తయారీకి మట్టిని ఉపయోగించేందుకు అంగీకరించడంతో, దాని ఎలా అమలు చేస్తున్నారనే అంశంపై హెచ్ఎంసీ ఇతర విభాగాల సమన్వయం సమావేశాలుంటాయన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు రమేశ్, రంగనాథ్, కార్తీకేయ, గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.