అడ్డగుట్ట, ఆగస్టు 17 : గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర సరఫరాదారుడిని ఉస్మానియా వర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.లక్ష విలువైన మాదకద్రవ్యాలు, రూ.4 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. గోవా రాష్ట్రంలోని అంజునా బార్డోజ్ ప్రాంతంలో ఉండే ప్రీతీశ్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు, అలియాస్ కాశీ(36) గోవా కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే ఉండే మంజూర్‌ను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఈక్టాసిటీ పిల్స్, ఎల్ఎస్డీ బ్లాట్స్, ఎండీఏ వంటి నార్కోటిక్ సింథటిక్ డ్రగ్స్‌ను గోవాకు చెందిన తుకారాం సాల్గోవ్ కర్, అలియాస్ నానా, వికాస్ నాయక్ అలియాస్ విక్కీ, రమేశ్ చౌహాన్, స్టీవ్, ఎడ్విన్ నూనిస్, సంజా గోవార్కర్ వద్ద తక్కువ ధరలకు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి.. వాటిని గ్రాముకు రూ.3 వేల చొప్పున అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. 2014లో గోవా అంజుమా బీచ్‌లో ప్రీతీశ్ డ్రగ్స్ అమ్ముతూ.. స్థానిక పోలీసులకు చిక్కాడు.
దీంతో అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి వచ్చాకా.. తిరిగి అదే దందా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16న హబ్సిగూడలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఓయూ, నార్కోటిక్ డ్రగ్స్ వింగ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది కస్టమర్లు ఉన్నారని, అతడి వద్ద డ్రగ్స్ కొంటున్న 166 మంది వివరాలు సేకరించామని డీసీపీ చక్రవర్తి తెలిపారు.