శామీర్‌పేట/మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 17 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని శామీర్‌పేట, తూంకుంట, అల్వాల్ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డు మార్గాలు గులాబీమయంగా మారాయి. ప్రధాన చౌరస్తాలు, రాజీవ్ రహదారిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో నిండిపోయాయి. సభ ప్రాంగణం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యాలయం ముఖద్వారం, కలెక్టరేట్లో ప్రముఖులు ఫొటోలకు పోజులిచ్చారు.
జనసంద్రంగా మారిన సభ స్థలి..
నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసిన సందర్భంగా బుధవారం అంతాయిపల్లి జనసంద్రంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 11 గంటల నుంచి సభాస్థలికి భారీగా జనం తాకిడి మొదలయ్యింది. ముఖ్యమంత్రి రాకముందే సభా ప్రాంగణం నిండిపోవడంతోపాటు ప్రాంగణం బయట జనాలు నిలిచి ఉన్నారు. సభా స్థలి వద్ద ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సందడి చేశారు. సీఎం సభతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెయ్యింతలయ్యింది. ప్రాంతాల వారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపడుతూ సభా ప్రాంగణానికి చేరుకోవడంతో కోలాహలంగా మారింది.
అమ్మవారికి పూజలు
శామీర్‌పేట పర్యటనలో భాగంగా మార్గమధ్యలో అల్వాల్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘన స్వాగతం :
తూంకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లిలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది.అధికార లాంఛనాలతో పోలీసులు స్వాగతం పలుకుతూ గౌరవ వందనం సమర్పించారు. మంత్రులు చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ హరీశ్ పుష్పగుచ్ఛంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన కలెక్టరేట్ భవనంలోని కార్యాలయాలను సందర్శించిన ముఖ్యమంత్రి కలెక్టర్ హరీశ్‌ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.