ఖైరతాబాద్, ఆగస్టు 10 : సమాజ సేవలో వాసవి సేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తున్నదని డీఐజీ (జైళ్ల శాఖ) డాక్టర్ డి. శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్‌లోని వాసవి సేవా కేంద్రంలోని కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు, వైశ్య రత్న దివంగత కొత్తూరు సీతయ్య గుప్తా 111వ జయంతి వేడుకలను ముఖ్య అతిథులుగా హాజరైన డీఐజీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు, వెట్ గ్రైండర్లు, వృద్ధులకు పింఛన్లు, ఉచిత బియ్యం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలందించడం గొప్ప విషయమన్నారు. వారి సేవలు మరింత విస్తరించాలన్నారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు పేదలకు సాయం అందిస్తే వారి జీవితాల్లో అభ్యున్నతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాగి ప్రకాశ్, కొల్పూరు రమేశ్, కోశాధికారి పంపాటి జ్ఞాన్‌చందర్, జీవితకాలపు ముఖ్య సలహాదారు కొండ్లె మల్లికార్జున్, కూర రఘువీర్, చీకట్మర్ల అశోక్, ప్రాజెక్టు చైర్మన్ రాజేశ్ కోలావర్, సేవా కార్యక్రమాల సబ్ కమిటీ చైర్మన్ కూర జయరాములు గుప్తా తదితరులు పాల్గొన్నారు.