సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కరోనా కారణంగా వాయిదాపడిన ‘సండే-ఫన్డే’ సందడి ప్రారంభం కానుంది. ఈనెల 14 నుంచి ట్యాంక్‌బండ్‌పై వినోద కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ప్రతి ఆదివారం సాగర్ అందాలను ఆస్వాదించడంతోపాటు ట్యాంక్‌బండ్‌పై నడుస్తూ విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆ రోజున నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌పై అదిరిపోయేలా పటాకులు మోగించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ‘ఆస్క్ కేటీఆర్’లో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. నగరంలో వరద సమస్యలను శాశ్వతంగా తీర్చే ఎస్ఎన్డీపీ పూర్తి ఫలాలు త్వరలో అందుతాయని, మెట్రో విస్తరణకు ప్రణాళిక చేపడుతున్నట్లు వెల్లడించారు.
ట్యాంక్‌బండ్‌పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ షురూ కానుంది. నిత్యం ట్రాఫిక్ జనప్రవాహంతో రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్ అందాలను ప్రశాంతంగా వీక్షించేందుకు మళ్లీ భాగ్యనగరవాసులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి ప్రతీ ఆదివారం సండే ఫన్డే పేరుతో ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. ఇంతకాలం కొవిడ్ నిబంధనల కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ‘ఆస్క్ కేటీఆర్’లో భాగంగా నెటిజన్ల ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ట్యాంక్ బండ్‌పైన సండే ఫన్ డే కార్యక్రమం తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్ అందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ని ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 14 నుంచి సండే-ఫన్డే కార్యక్రమాన్ని పున: ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆరవింద్‌కుమార్ ప్రకటించారు.
ఆ రోజున నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌పైన పటాకుల సందోహంతో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఆరెస్ట్రా – తెలుగు పాటలు, ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం, బాణాసంచా వెలుగులు, తినుబండారాలు, చేనేత, హస్తకళల ప్రదర్శన, ఉచిత మొకలు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా ఆస్క్ కేటీఆర్‌లో మరిన్ని అంశాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమ పూర్తి ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు.
ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయన్నారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ సీం పైన హైకోర్టు స్టే ఇచ్చిందని దానిపై న్యాయపరంగా పోరాడి రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. నగరంలో ఈ-బీఆర్టీఎస్ వంటి అనేక ప్రణాళికలపై పనిచేస్తున్నామని, త్వరలోనే మెట్రో విస్తరణ పై కూడా ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హెచ్ఎండీఏ ఇప్పటికే 19 అర్బన్ పారులను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరిన్ని అర్బన్ లంగ్ స్పేస్‌లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
నెటిజన్ల సంభాషణలో ముఖ్యమైనవి కొన్ని ..
హైదరాబాద్ మోజో: హైదరాబాద్ మెట్రో విస్తరణకు గడువును పెట్టుకున్నారా?
మంత్రి కేటీఆర్: మెట్రో విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. రద్దీకి అనుగుణంగా సరికొత్త ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఈ-బీఆర్టీఎస్)ను, పీఆర్పీ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ను తీసుకురాబోతున్నాం. మరో వారం రోజుల్లో ప్రకటన రానుంది.
సాయి రత్న చైతన్య: నగరంలో ఉన్న బస్సులు సరిపోవడం లేదు ? పెంచే ఆలోచన ఉందా?
మంత్రి కేటీఆర్: రద్దీకి అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నాం. సుమారు 3800 బస్సులతో రవాణా సేవలను అందిస్తున్నాం.
శ్రీ:ప్రగతినగర్ చెరువు వద్ద ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. అండర్‌పాస్ నిర్మాణం జరిపితే పరిష్కారం అవుతుంది?
మంత్రి కేటీఆర్: విజ్ఞప్తిని పరిశీలిస్తాం. హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటారు.
రామోజ్: నగరంలో సైకిల్ ట్రాక్‌లు ఉన్నాయా? సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మంత్రి కేటీఆర్: గ్రేటర్ జోన్ల వారీగా ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా సైక్లింగ్ ట్రాక్‌లు సిద్ధమయ్యాయి. త్వరలో ప్రారంభిస్తాం.
సాయినాథ్ చౌదరి: నగరంలోని చెరువులు మురికికూపంగా మారాయి? దీనికి మీరేం చేస్తున్నారు?
మంత్రి కేటీఆర్: జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు స్పెషల్ కమిషనర్‌ను నియమించాం. 185 చెరువుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్టీపీల నిర్మాణంతో మురుగునీటిని శుద్ధిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుంది..
డాక్టర్ విక్రమ్ సిన్హా : జీహెచ్ఎంసీలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మంత్రి కేటీఆర్: దోమల నియంత్రణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ బృందాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణపైన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నది.
కెప్టెన్ శశాంక్ : నేను ఇటీవల హైదరాబాద్ పర్యటన చేశాను. నగరంలో చాలా గొప్పగా అభివృద్ధి జరిగింది. ఆరోగ్యకరమైన పార్కులను మరిన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
మంత్రి కేటీఆర్: హైదరాబాద్ అభివృద్ధిని గుర్తించినందుకు ధన్యవాదాలు. మీ విజ్ఞప్తిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పరిశీలించి చర్యలు తీసుకుంటారు.