ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 5: రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని బజారు వేషాలు కట్టినా, ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా ఫలితం ఉండబోదని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుంగ బాలు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని నడిసముద్రంలో ముంచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కాంట్రాక్టులు, కాంగ్రెస్‌లోని కొట్లాటల కోసం మునుగోడును బలిచేయాలని చూడటం అవివేకమన్నారు. దీనికి కోమటిరెడ్డి సోదరులు కుట్ర పన్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కోమటిరెడ్డి సోదరులు ఇక్కడి ప్రజలకు, ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
వారి సొంత ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజలను మోసం చేస్తూ, నేడు కొత్త వేషంతో బీజేపీ తీర్థం పుచ్చుకుని స్వలాభం కోసం కాంట్రాక్టులను కైవసం చేసుకుని ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు.. కుతంత్రాలు చేసినా అక్కడి ప్రజలు పట్టం కట్టేది టీఆర్ఎస్కేనని అన్నారు. యావత్ విద్యార్థి, యువత బీజేపీని పాతర వేసే కార్యక్రమంలోనే ఉన్నారని చెప్పారు. బీజేపీ కేంద్రంలో అవలంబిస్తున్న దరిద్రపు నిర్ణయాల వల్ల దేశం ఈ రోజు దివాళా తీసే స్థాయికి వచ్చిందని అభిప్రాయపడ్డారు. అటువంటి బీజేపీని ఇక్కడ విశ్వసించే స్థాయిలో మునుగోడు ప్రజలు లేరని తుంగ బాలు ఎద్దేవా చేశారు.