కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 5 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లపై జడ్సీ మమత ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 8 నుంచి 22 వరకు మువ్వన్నెల జెండా మురిసేలా, స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు. ఈనెల 8న వజ్రోత్సవాలు ప్రారంభవమవుతాయని.. ఆగస్టు 9న ఇంటింటికి జెండాల పంపిణీ, ఆగస్టు 10న మొక్కలు నాటడం, ఆగస్టు 11న ఫ్రీడమ్ రన్, ఆగస్టు 12న టీవీ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు, ఆగస్టు 13న విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ విభాగాలతో ర్యాలీలు, ఆగస్టు 14న నియోజకవర్గ కేంద్రాలలో సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, బాణాసంచా పేలుళ్లు, ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలు, ఆగస్టు 16న తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో జాతీయ గీతం ఆలాపన, కవి సమ్మేళనాలు, ఆగస్టు 17న రక్తదాన శిబిరాలు, ఆగస్టు 18న ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్, ఆగస్టు 19న వైద్యశాలల్లో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో పండ్లు, మిఠాయిల పంపిణీ, ఆగస్టు 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తిపై రంగోళి పోటీలు, ఆగస్టు 21న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం, ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ వేడుకలను విజయవంతం చేసే దిశగా సర్కిళ్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రతిష్టాత్మక భవనాలను విద్యుత్ దీపాలతో 15 రోజులపాటు అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ప్రజలందరిలోనూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేలా ఏర్పాట్లు ఉండాలని.. వజ్రోత్సవాల్లో ప్రజలందరినీ భాగస్తులను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్, మంగతాయారు, నాగమణి, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు, ఏఎంసీలు, ఏఎంహెచ్వోలు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.