కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వాన కాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జోన్న పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యత ఇస్తారు. కాగా, మరి కొంత మంది రైతులు కేవలం కూరగాయాల పంటలు మాత్రమే సాగు చేస్తారు. టమాట, బెండ, వంగ, మిర్చి, క్యాబేజీ వంటి తదితర కూరగాయాల పంటలను పండించడంలో మండలం ప్రసిద్ధిగాంచింది.
కందుకూరు, జూలై 31 : గతంలో కూరగాయాలు పండించడానికి ముందు భూమిని సిద్ధం చేసి.. నాణ్యమైన కూరగాయాల విత్తనాలను కొనుగోలు చేసి వారి వారి చేలల్లోనే నారువేసి మొలకెత్తిక తరువాత విత్తుకునే వారు. ప్రస్తుతం రైతులు దాదాపు ఈ పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు. కారణం కొత్తగా కూరగాయాల నారు అందించే నర్సరీలు వెలిశాయి. దీంతో రైతులు తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.
కాగా నగరానికి నియోజకవర్గం కూత వేటు దూరంలో ఉండటంతో చాలా మంది రైతులు కూరగాయాలను పండించి హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తుంటారు. దీంతో కూరగాయాల సాగుకు చాలా మంది రైతులు మొగ్గు చూపడంతో కొందరు మండల కేంద్రంలో నర్సరీలను ఏర్పాటు చేసుకొని కూరగాయాల నార్లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతులు కోరుకున్న రకం నారు లభ్యం అవుతుండటంతో మండల రైతులే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చి నర్సరీల్లోని నారును కొనుగోలు చేసి నాటుకుంటున్నారు. నర్సరీల్లో మిరప, టమాట, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంకాయ, తదితర కూరగాయాలతో పాటు రైతుల కోరిక మేరకు పూల మొక్కల నారును సైతం ఆర్డర్లపై అందిస్తున్నారు. ఏడాది పొడువునా రైతులకు కావాల్సిన నారును అందుబాటులో ఉంటుందని నర్సరీల నిర్వాహకులు తెలిపారు.
సౌకర్యంగా ఉంది..
రైతులు నారు వేసుకోవాలంటే మడికట్టి విత్తనాలు విత్తుకోవాలి. వాతావరణం సహకరించక పోతే విత్తనాలు, ఎరువులు, చేసిన కష్టంతో పాటు సమయం వృథా అవుతుంది. ప్రస్తుతం కావాల్సిన కూరగాయాల నారు నర్సరీల్లో లభ్యమవుతుంది. దీంతో నారు తెచ్చకొని నాట్లు వేసుకుంటున్నాం. రైతులకు అందుబాటులో ఉండటంతో పాటు ఉపయోగకరంగా ఉంది.
– సురుసాని సత్యనారాయణరెడ్డి,రైతు, మాజీ సర్పంచ్ కందుకూరు
అందుబాటులో ధరలు..
రైతులకు కావాల్సిన వివిధ రకాల కూరగాయాల నారు నర్సరీల్లో సిద్ధంగా ఉంది. ఒక్కో మొక్క రైతులకు అనుకూలమైన ధరలకే విక్రయిస్తాం. పూల మొక్కలు, కూరగాయాల మొక్కల ధరలు వేర్వేరుగా ఉంటాయి. తమకు ఉపాధితో పాటు రైతులకు అనుకూలంగా ఉంటుంది.
– గణేశ్, నర్సరీ నిర్వాహకుడు కందుకూరు