సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ, దాని చుట్టూ విస్తరిస్తున్న శివారు మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు అమలు చేయనున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు, నగరం చుట్టూ ఉన్న పలు శివారు మున్సిపాలిటీల్లో 2410 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నది. 104 కారిడార్లలో రహదారులను నిర్మించనున్నారు. అందులో 50 కొత్త రోడ్లతో పాటు ఇతర చోట్లలో లింకురోడ్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అవసరమైన పరిపాలనా అనుమతులను జారీ చేసింది. దీనివల్ల హైదరాబాద్లో భారీ ఎత్తున కొత్త లింకు రోడ్లను, మరికొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా సిటీకి ఆనుకొని ఉన్న బండ్లగూడ జాగీ ర్, జవహర్నగర్, దమ్మాయి గూడ, నాగారం, కొత్తూరు, శంషాబాద్, గాజుల రామారం, నిజాంపేట వంటి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కొత్త రోడ్లు నిర్మిస్తారు.
వేగంగా విస్తరిస్తున్న నగరంలో మరిన్ని సౌలత్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులోభాగంగా జీహెచ్ఎంసీతో పాటు పది శివారు మున్సిపాలిటీల్లో మెరుగైన రోడ్ల అభివృద్ధి కోసం ఒకేసారి రూ. 2410 కోట్లతో 104 రోడ్లను(కొత్త రోడ్లు.. లింక్ దారులు ) నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మొదటి దశలో 50 రహదారులను వెంటనే నిర్మించేందుకు రూ. 1500 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు జారీ చేసింది. ఐదు ప్యాకేజీలుగా విభజించి.. చేపట్టే తొలి విడత రహదారుల నిర్మాణానికి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ త్వరలోనే పనులు చేపట్టనున్నది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
-మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శివారు మున్సిపాలిటీల్లో రహదారుల నిర్మాణాలు, విస్తరణకు రూ. 481 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
